bheemla nayak appropriate action will be takenఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్న “భీమ్లా నాయక్” చుట్టూ జగన్ సర్కార్ ఉచ్చు బిగుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను అంత తేలికగా విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ ఏ మాత్రం సుముఖంగా లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. ఇప్పటికే అధికారులందరికీ మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లుగా వార్తలు రాగా, రూరల్ ఏరియాలలో పేపర్ పై ఆదేశాలు జారీ అవుతున్నాయి.

ముందుగా కృష్ణాజిల్లా, గుడ్లవల్లేరు గ్రామంలో గల రామకృష్ణ ధియేటర్ కు తహసీల్ధారు జారీ చేసిన ఆదేశాల ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బహుశా రిలీజ్ ముందు రోజు ఇదే తీరున ఇతర ప్రాంతాలలోనూ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఏతావాతా తేలుతోంది ఏమిటంటే… ‘భీమ్లా నాయక్’కు చుక్కలు చూపించేందుకు జగన్ సర్కార్ ఏ మాత్రం వెనుకాడడం లేదని స్పష్టమవుతోంది.

నిజానికి టికెట్ ధరల జీవో రాదన్న విషయం ఇప్పటికే స్పష్టం కాగా, కనీసం బెనిఫిట్ షోలకైనా అనుమతులు లభిస్తాయేమోనని భావించగా, అందుకు కూడా జగన్ సర్కార్ ససేమీరా అనడం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఓ పక్కన తెలంగాణాలో రెండు షోలు ముగిసే సమయానికి ఏపీలో మొదటి షో ప్రారంభం కావడం అనేది ఖచ్చితంగా ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావితం చూపుతుంది.

పవన్ కళ్యాణ్ సినిమా పట్ల జగన్ సర్కార్ చూపుతోన్న వివక్షకు పవర్ స్టార్ అభిమానులు రగిలి పోతున్నారు. రాజకీయ పరంగా వైసీపీకి, సినిమాల పరంగా పవన్ కు అభిమానులుగా ఉన్న వారు కూడా జగన్ విధానాల పట్ల మిక్కిలి నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇందుకోసమేనా మెగాస్టార్ చిరంజీవి చేత దండాలు పెట్టించుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా!

అయితే ఆఖరి ప్రయత్నంగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి ఏపీ సర్కార్ ను గురువారం నాడు సంప్రదించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు జగన్ చెంతకు వెళ్లి వేడుకున్న మెగాస్టార్, ముచ్చటగా మూడోసారి కూడా తన వంతు ప్రయత్నాలు చేసినంత మాత్రాన “భీమ్లా నాయక్”కు వెసులుబాటు ఇస్తారన్న నమ్మకం అయితే ఎక్కడా వ్యక్తం కావడం లేదు.

తొలుత మెగాస్టార్ వెళ్లిన సందర్భంలో ఒక వారం లేదా పది రోజులలో జీవో వచ్చేస్తుందని మీడియా ముఖంగా ప్రకటించారు. రెండవ సారి చిరు బృందం చేరుకున్న సమయంలో, మెగాస్టార్ తో సహా మహేష్ బాబు కూడా ఒక వారం లేదా పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని అన్నారు. నాడు చిరు వ్యాఖ్యలు గానీ, ఇటీవల మహేష్ చెప్పినట్లుగా వారం, పది రోజులైతే గడుస్తున్నాయి గానీ, జీవో మాత్రం రావడం లేదు.

bheemla nayak appropriate action will be taken