Bhavana  wont act until the culprits punishedయావత్తు ఇండియన్ సినీ పరిశ్రమ అవాక్కయ్యే విధంగా జరిగిన భావన ఘటనలో నేరస్తులంతా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అసలు సూత్రధారిగా భావించిన సునీల్ కుమార్ అరెస్ట్ కావడంతో, ఎట్టకేలకు నోరు విప్పింది భావన. కేవలం తన భావాలను వ్యక్తం చేయడం కాదు, ఏకంగా శపథం కూడా చేసింది. తనపై దాడి చేసిన నేరస్తులకు శిక్ష పడేవరకు తాను సినిమాల్లో నటించేది లేదని భావన చెప్పింది.

అరెస్ట్ చేసిన నిందితులను విచారించే క్రమంలో మరియు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ ఫోన్ ద్వారా పలు విషయాలు వెలుగు చూశాయి. ఓ ప్రముఖ నటుడు, ఓ రాజకీయ నాయకుడి ఇద్దరు కుమారులు కిడ్నాపర్లతో పలుమార్లు మాట్లాడినట్టు, వారితో 50 లక్షలకు బేరం కుదిరినట్టు నేరస్థులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో తెరవెనుక ఉన్న వారంతా బయటకు రానున్నారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

తనపై జరిగిన అమానుషాన్ని బయట ప్రపంచానికి తెలియచెప్పడమే కాకుండా, తనకు న్యాయం జరిగే సినిమాల్లో నటించేది లేదని చెప్పిన భావన ధైర్యాన్ని, తెగువను అభినందించాల్సిందే. అయితే మన న్యాయవ్యవస్థలో ఎంత తొందరగా న్యాయం జరుగుతుందనేది జగమెరిగిన సత్యమే. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి మరీ విచారణ చేసిన నిర్భయ ఉదంతంలోనే తీర్పు ఎన్నాళ్ళకు వచ్చిందో అందరికీ తెలిసిందే.

మరి ఇలాంటి తరుణంలో భావన కేసులో అంతిమ తీర్పు ఎప్పటికి వస్తుందో అన్న ప్రశ్నకు జవాబు మాత్రం లభించడం కష్టం. బహుశా సెలబ్రిటీ హోదాలో ఉంది కాబట్టి, ఏమైనా సంచలనాలు నమోదవుతాయేమో చూడాలి. అయితే ఎంత కాదనుకున్నా మరో ఏడాది పాటు భావనను సిల్వర్ స్క్రీన్ పైన అభిమానులు చూడకపోవచ్చు. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత లేదు.