Bhavana Assault Latest Newsదేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న హీరోయిన్ భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్‌ అలియాస్ పల్సర్ సుని కేర‌ళ‌లోని ఎర్నాకులం కోర్టులో లొంగిపోవ‌డానికి వ‌చ్చాడు. అయితే అత‌డు లొంగిపోక‌ ముందే పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. భావ‌న కిడ్నాప్ విష‌యంలో ఓ బ‌డా నిర్మాత‌కు నాలుగు సార్లు ఫోన్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

సునీల్ కుమార్‌తో పాటు మ‌రో నిందితుడు విగీష్‌ ను కూడా అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. సునీల్ అరెస్టు కావ‌డంతో ఈ దారుణం వెనుక ఉన్న అసలు “వాస్తవాలు” బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. భావ‌నపై జ‌రిగిన దారుణాన్ని ఖండిస్తూ క‌న్న‌డ‌, మ‌లయాళ‌, తెలుగు సినీ న‌టుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై మరో హీరోయిన్ స్నేహ తాజాగా మండిపడింది.

మహిళలను దేవతలుగా కొలిచే ఈ దేశంలో… మహిళలపై ఇన్ని దారుణాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిర్భయ, నందినిలకు జరిగినట్టు ఇకపై ఏ ఇతర మహిళకు జరగకూడదని, హీరోయిన్లు భావన, వరలక్ష్మిలకు మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ రాసింది. తమ పట్ల జరిగిన వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడిన వారిద్దరినీ ఎంతో అభినందిస్తున్నానని, వారికి ఎదురైన అనుభవాలను తలచుకుంటేనే ఆవేదన కలుగుతోందని చెప్పింది.

దేశాన్ని అమ్మగా పిలిచే మన రాజ్యంలో, జీవ నదులన్నింటికీ మహిళల పేర్లే పెట్టారని… దేవుడితో సమానంగా వీటిని పూజిస్తారని… ఇలాంటి దేశంలో మహిళలు హుందాగా, గౌరవంతో బతికే రోజులు పోయాయని సదరు లేఖలో పేర్కొంది. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం అని చెప్పింది. మహిళలపై జరుగుతున్న దారుణాలపై పోరాడటానికి ఇదే సరైన సమయమని స్నేహ అభిప్రాయపడింది. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే చట్టాలను తీసుకు రావాలని కోరింది. ఈ సందర్భంగా ఓ తల్లిగా తాను ఓ ప్రతిజ్ఞ చేస్తున్నానని… మహిళలను గౌరవించేలా తన కుమారుడిని పెంచుతానని మాట ఇస్తున్నానని తెలిపింది.