Bharath Ane Nenu Ugadhi Poster‘ఉగాది శుభాకాంక్షలు’ అంటూ ‘భరత్ అనే నేను’ టీం నుండి విడుదలైన పోస్టర్ ప్రిన్స్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అంశాలలో ఈ పోస్టర్ ‘ది బెస్ట్’ అనిపించే విధంగా అభిమానుల అంచనాలను ఆకాశానికి తీసుకెళ్ళిందని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే… పంచెకట్టులో ప్రిన్స్ అలా నడిచి వస్తుంటే… చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామాకు అంతేలేదు.

ఈ ఉగాది సందర్భంగా ఉదయం నుండి అనేక పోస్టర్స్ విడుదలయ్యాయి. అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్ లుక్ తో అందరినీ ఫిదా చేసాడు ప్రిన్స్. ఊహించని ట్విస్ట్ ఇచ్చి ప్రిన్స్ అభిమానులను సంతృప్తి పరచడంలో దర్శకుడు కొరటాల శివ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ‘శ్రీమంతుడు’ సినిమాలో గళ్ళ లుంగీలో ప్రిన్స్ ను చూపించిన కొరటాల, ఈ సారి ముఖ్యమంత్రి గెటప్ కనుక, పంచెకట్టులో చూపించి సర్ ప్రైజ్ చేసాడు. ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ప్రిన్స్ ఎలాంటి సందడి చేస్తాడో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.