Kodali-Nani-on-NTR-and-YSRవిజయవాడ కేంద్రంగా కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం జగన్ మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఇది కాకుండా రొటీన్ గా ఇక తెలుగుదేశం పార్టీపై చేసే విమర్శలు సహజమే.

ఈ సందర్భంగా “భారతరత్న”కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో తమకు అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వాన్ని, తమతో సంబంధం లేని ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వమని అడిగితే అది రాజకీయ వ్యభిచారం అవుతుందని కొడాలి నాని అన్నారు.

మనకు అనుకూలంగా, మనతో కలిసి పనిచేసే ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పడితే అప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలకు భారతరత్న ఇవ్వాలి, అలాగే ఎన్టీఆర్, వైఎస్సార్ లాగా పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి ”భారతరత్న” అడిగి తీసుకుంటే వస్తుంది గానీ, రాజకీయం చేస్తే కాదని అన్నారు.

నిజానికి “భారతరత్న” ప్రకటించడానికి సానుకూల ప్రభుత్వాలు ఉండాలన్న నిబంధన గురించి బహుశా ఎవరికీ తెలియదేమో గానీ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. పనిలో పనిగా ఎన్టీఆర్ తో పాటు వైఎస్సార్ ను కూడా కలిపేయడం అనేది కొడాలి నానిలో రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తోంది.

మరి ఏం అర్హతలు ఉన్నాయని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ‘భారతరత్న’ ఇవ్వాలని కొడాలి నాని తెరపైకి తెచ్చారో గానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద దుమారాన్నే రేపుతోంది. నాటి ఎన్టీఆర్ హయాంలో అనేక విప్లవాత్మకమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాలకు తోడు, కోడెల శివప్రసాద్ హోమ్ మంత్రిగా హైదరాబాద్ ను కంట్రోల్ లోకి తెచ్చిన ప్రభుత్వంగా నిలబడింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాలన ఒక చరిత్ర సృష్టించిన అంశంగా నిలిచిపోయింది.

మరి వైఎస్సార్ హయాంలో ఒక్క “ఆరోగ్య శ్రీ” మినహా ప్రజల పరంగా చెప్పుకోవడానికి ఇప్పటివరకు మిగిలింది ఏమీ లేదు, వైఎస్సార్ తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి విషయంలో అయితే ఇప్పటికీ సీబీఐ మరియు ఈడీ పరిధిలో కొన్ని వేల కోట్లకు సంబంధించిన కేసులైతే పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ అప్పటి వైఎస్సార్ హయాంలో జరిగిన వాటికి సంబంధించినవే.

‘భారతరత్న’ ప్రకటించడానికి బహుశా తమకు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం ఉండడమే కొడాలి నాని దృష్టిలో అతి పెద్ద అర్హతగా భావిస్తున్నారేమో? అలా అయితే ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డికే కాదు, గడిచిన రెండున్నర్రేళ్ళుగా అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ‘భారతరత్న’ ఇచ్చేస్తారేమో!? ఏదైనా అనుకూల ప్రభుత్వంలో ఉంటుందన్నది కొడాలి నాని గారి లాజిక్!