Bharat ane Nenu USA collections‘యుఎస్ కింగ్’ అని చెప్పగానే మరో మాటకు ఆస్కారం లేకుండా టక్కున ప్రిన్స్ మహేష్ బాబు పేరు గుర్తుకు వస్తుంది. ‘అతడు’ సినిమాతో మొదలైన ప్రస్థానం, ‘శ్రీమంతుడు’ సినిమా వరకు నిర్విఘ్నంగా లాభాలు పండించిన ప్రిన్స్, గత రెండు సినిమాలు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ల ద్వారా తీవ్ర నష్టాలను కూడా రుచిచూపించారు.

ఫ్లాప్ లు అయినా, ఈ రెండు సినిమాలు 1 మిలియన్ డాలర్స్ లో చేరగా, మరో పక్కన మంచి టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు అవలీలగా 1 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ప్రిన్స్ రేంజ్ ను మరోసారి నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. దానికి వేదిక ‘భరత్ అనే నేను’ అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయి.

మహేష్ గత చిత్రం ‘స్పైడర్’పై లేని క్రేజ్, ప్రస్తుతం ‘భరత్ అనే నేను’పై ఉందని చెప్పడంలో సందేహం లేదు. ‘స్పైడర్’ చావుకు సవాలక్ష కారణాలన్నట్లు… ‘భరత్ అనే నేను’పై మంచి బజ్ ఏర్పడడానికి కూడా అనేక కారణాలున్నాయి. దీంతో యుఎస్ లో మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ప్రీమియర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు.

‘బాహుబలి 2’ వంటి ఒక తెలుగు సినిమా విడుదలకు చేసిన సన్నాహాలు, ప్రస్తుతం ‘భరత్ అనే నేను’కు జరుగుతుండడం ఊహించని అంశం. మహేష్ కు యుఎస్ లో మంచి మార్కెట్ ఉన్న విషయం నిజమే గానీ, మరీ ఒక సాధారణ సినిమాతో ఆ స్థాయిలో విడుదలకు నోచుకోవడం అనేది ఒక రకంగా డేరింగ్ నిర్ణయంగానే భావించాలి.

కేవలం ప్రీమియర్స్ ద్వారానే గత రికార్డులను కొల్లగొట్టి తొలిరోజునే నాన్ బాహుబలి రికార్డులను సెట్ చేయడానికి గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతోంది. సిల్వర్ స్క్రీన్ పై కొరటాల – ప్రిన్స్ ద్వయం చెలరేగితే… కళ్ళు చెదిరే ఫిగర్స్ కు వేదికగా ‘భరత్ అనే నేను’ సినిమా నిలవనుందని చెప్పడంలో సందేహం లేదు. ‘భరత్’ వచ్చే సమయానికి యుఎస్ లో మహేష్ కు పోటీనిచ్చే సినిమా మరొకటి లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశం.