bharat-ane-nenu-script-rumor-koratala-siva‘జై లవకుశ’ సినిమా తర్వాత, రిలీజ్ కు ముందు ట్రేడ్ వర్గాల్లో ఓ కధ గురించి ఎక్కువ చర్చ జరిగింది అంటే… అది ఖచ్చితంగా ‘భరత్ అనే నేను’ సినిమా కధ గురించే..! ఈ సినిమా కధను ఎవరో రాస్తే, దానిని కొరటాల శివ కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసారని, అంత మంచి కధ ఇదని గత కొంతకాలంగా సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలోనే మొదలైన ఈ వార్తలపై చిత్ర యూనిట్ గానీ, కొరటాల శివ గానీ ఎప్పుడూ స్పందించలేదు.

అయితే సినిమా విడుదల మరో అయిదు రోజులు ఉందనగా, ప్రింట్ మీడియాలకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో కొరటాల శివ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. “అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, దర్శకుడు శ్రీహరి తనకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తని, ఈ కధకు సంబంధించిన ఐడియా తనదేనని, హీరో ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఆలోచన కూడా తనదేనని, ఆ తర్వాత కధను తాను డవలప్ చేసానని, కధ చాలా పెద్దగా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుందని” కొరటాల స్పష్టం చేసారు.

ఈ కధకు సంబంధించిన క్రెడిట్ లో శ్రీహరి షేర్ తప్ప ఇంకెవరూ లేరని చెప్పిన కొరటాల, ఇలాంటి ఛాలెంజింగ్ స్టోరీలు చేయాలంటే మహేష్ బాబుకు చాలా ఇష్టం గనుకనే కధ ఆయనకు చెప్పి ఒప్పించానని అన్నారు. కేక్ వాక్ స్టోరీలను చేయడం మహేష్ కు ఏ మాత్రం ఇష్టం ఉండదని, ఈ కధలో తన అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించాడని చెప్పుకొచ్చారు. పరీక్షలు ఎంత బాగా రాసినా ఫలితాల కోసం వేచిచూసే విద్యార్ధుల మాదిరి ప్రస్తుతం మేమంతా ఏప్రిల్ 20వ తేదీ కోసం నిరీక్షిస్తున్నామని అన్నారు కొరటాల.