Bharat ane Nenu Movie Collectionsభరత్ అనే నేను… సోషల్ మీడియా అంతటా బ్లాక్ బస్టర్ టాక్. రివ్యూలు కూడా అలానే వచ్చాయి. ‘మౌత్ టాక్’ కూడా నెగటివ్ లేదు. కానీ కలెక్షన్స్ మాత్రం ఈ ‘టాక్’కు తగ్గట్లుగా లేకపోవడం విస్తుపోయే అంశం. ముఖ్యంగా ఓవర్సీస్ లో మహేష్ ఫ్లాప్ చిత్రాలు కూడా సూపర్ కలెక్షన్స్ ను అందిపుచ్చుకుంటాయి. అలాంటిది ‘బ్లాక్ బస్టర్’ టాక్ అంటే, మోతమోగిపోవాలి, గత రికార్డులు బద్దలైపోవాలి. మరి అలా జరుగుతోందా? అంటే కాదనే చెప్పాలి.

ప్రీమియర్స్ + ఫస్ట్ డే కలిపి కేవలం 1.4 మిలియన్స్ వరకు కొల్లగొట్టిన ‘భరత్ అనే నేను’ రెండవ రోజు హాఫ్ మిలియన్ కు పైగా వసూలు చేసి మొత్తమ్మీద 2 మిలియన్ క్లబ్ లో చేరింది. మొదటి రెండు రోజులు కలిపితే 2 మిలియన్స్ చేరుకున్నా, అంచనా వేసింది అయితే దాదాపుగా 3 మిలియన్స్! ఇతర హీరోల సినిమాలకు అయితే ఇవి రికార్డ్ వసూళ్ళగానే పరిగణించవచ్చు. కానీ యుఎస్ లో మహేష్ మార్కెట్ కు గానీ, స్టామినాను గానీ ఈ కలెక్షన్స్ సరిగ్గా ప్రాజెక్ట్ చేయడం లేదు.

ఇందుకు గల కారణాలను కూడా పంపిణీదారులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘భరత్ అనే నేను’ సినిమా టికెట్లకు ఎలాంటి ఆఫర్లను ఇవ్వలేదని, అలాగే టికెట్ ధరలను రిజనబుల్ ప్రైస్ లో ఉంచమని, తొలిరోజు కలెక్షన్స్ మొత్తం ప్రిన్స్ స్టామినా వలనే వచ్చాయని వివరణ ఇచ్చుకుంది. కానీ యుఎస్ లో రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్న అభిమానులకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. బహుశా సండే వచ్చే కలెక్షన్స్ తో ‘భరత్ అనే నేను’ ఎక్కడ ల్యాండ్ అవుతుందన్నది క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది.

మరోవైపు ‘రంగస్థలం’ 3.4 మిలియన్ డాలర్స్ తో ఉండగా, ఓవరాల్ గా 3.5 మిలియన్ డాలర్స్ ను అందిపుచ్చుకుంటుందనేది అంచనా. ఆ లెక్కన కనీసం ‘రంగస్థలం’ను అయినా ‘భరత్ అనే నేను’ చేరుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కీలకమైన శనివారం నాడు హాఫ్ మిలియన్ ను దాటి వసూలు చేయగా, ఆదివారం ఈ ఫిగర్ ఇంకాస్త తగ్గే అవకాశం ఉంది. ఆ లెక్కన 3 మిలియన్స్ కు అయినా చేరుకుంటుందో లేదో అన్న సందేహాలు ప్రస్తుతం నెలకొన్నాయి.