Bharat Ane Nenu Mahesh babuప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకేక్కిస్తోన్న “స్పైడర్” సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో ప్రిన్స్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరగాల్సిన షూటింగ్ కాస్త చెన్నైకు మారింది. ‘స్పైడర్’ సంగతి ఇలా ఉంటే, ఈ నెల 22వ తేదీ నుండి మహేష్ నటిస్తున్న తదుపరి చిత్రం “భరత్ అనే నేను” రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ‘శ్రీమంతుడు’ దర్శకుడు కొరటాల శివ కెరీర్ లో ఇప్పటికే ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు కావడంతో, ‘భరత్ అనే నేను’పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.

అందులోనూ ప్రిన్స్ మహేష్ బాబు యువ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ ప్రిన్స్ అభిమానులతో పాటు, సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తిని పెంచుతోంది. దీనికి తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశాలు, అలాగే ఇంటర్వెల్ ముగిసిన తర్వాత వచ్చే సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో కొరటాల తీర్చిదిద్దారన్న ప్రచారం జరుగుతోంది. మహేష్ ను మొదటిసారిగా ఊర మాస్ లెవల్లో చూపించబోతున్నారని జరుగుతోన్న ఈ పబ్లిసిటీ అప్పుడే అవసరమా?

చిత్ర యూనిట్ పని కట్టుకుని ఈ ప్రచారం చేయించకపోయినప్పటికీ, సినిమా కధ తెలిసిన చిత్ర యూనిట్ సభ్యుల ద్వారానో, ఇంకో మార్గం ద్వారానో, ఇటీవల సినిమాల థీమ్ బయటకు వచ్చేస్తోంది. గతంలో ‘జై లవకుశ’ కధ గురించి ఇలాగే భారీ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే కనీసం షూటింగ్ కూడా మొదలు పెట్టకముందే, ఈ రేంజ్ లో ఊదరగొడితే, సినిమా పూర్తయ్యే నాటికి పరిస్థితి తారాస్థాయికి చేరుకొని, అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల వలన భారీ ఫ్లాప్ లు చవిచూసిన అనుభవాలు తెలుగు సినిమాకు కొత్తమీద కాదు.