Bharat-Ane-Nenu-Mahesh-Babu-Reviewప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో ప్రయోగాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే, దానికి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబే అని చెప్పాలి. ఇది నిర్వివాదమైన అంశం గనుకనే… జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్ గా ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే ఇక నుండి ప్రయోగాలు చేయనని, ఇప్పటివరకు చేసి అలిసిపోయానని మహేష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటకొస్తే… ఇప్పుడే కాదు, గతంలో కూడా వివిధ సందర్భాలలో ప్రయోగాల గురించి మహేష్ ఇలాగే చెప్పుకొచ్చారు.

‘అర్జున్’ సినిమా విజయోత్సవ టూరింగ్ లో భాగంగా విజయవాడ చేరుకున్నపుడు, ‘మహేష్ ఒక్కడే ఈ తరం హీరోలలో కొత్త తరహా కధలను ఎంపిక చేసుకుంటున్నారని, అది అలాగే కొనసాగాలని’ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బహిరంగంగా మహేష్ కు కితాబు ఇవ్వగా, ఆ వెంటనే మహేష్ మైక్ అందుకుని ‘ఇక ప్రయోగాలు చేయబోనని’ ప్రకటించారు. అయితే ఆ తర్వాత మహేష్ ఎంపిక చేసుకున్న కధలు, వాటి కొత్తదనాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.

తాజాగా విడుదలైన ‘భరత్ అనే నేను’ కూడా ఓ సాహసమేనని చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి పాత్ర, అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రగులుతున్న సమయంలో… ఇలాంటి రోల్ ను ఎంపిక చేసుకోవడం ఒక సవాలే! రిలీజ్ అయిన తర్వాత హిట్టు అవ్వొచ్చు, సూపర్ హిట్టు అవ్వొచ్చు, లేదంటే బొమ్మ తిరగపడవచ్చు. కానీ దీనిని అసలు అంగీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న తపన మహేష్ లో ఉండడం, నిజంగా ప్రశంసించదగ్గ విషయం.

బహుశా ఇదే కధను ఇతర అగ్ర హీరోలకు చెప్తే… ఎంతమంది హీరోలు ఒప్పుకుంటారనేది ప్రశ్నార్ధకమే! పొలిటికల్ నేపధ్యం ఉన్న కధ అంటే సున్నితత్వంతో కూడుకుని ఉంటుంది గనుక, టచ్ చేయడానికి కూడా సాహాసించరు. అందుకే రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్ల నుండి అనిల్ రావిపూడి వంటి కమర్షియల్ డైరెక్టర్ల వరకు అందరూ ప్రిన్స్ గట్స్ ను మెచ్చుకుంటున్నారు. నిజానికి ఆ గట్సే మహేష్ బాబును ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పవచ్చు. వరుసగా మాస్ సినిమాలు చేసుంటే క్రేజ్, సక్సెస్ లు ఇంతకు మించి వచ్చుండేవేమో గానీ, ఇంత పేరు ప్రఖ్యాతలు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండేవి కావు.

ప్రతిసారి ప్రయోగం చేయనని చెప్పడం, ఆ తర్వాత ప్రయోగం చేయడం అనేది “మహేష్ బాబు స్పెషాలిటీ”గా మారిపోయింది. ఆ మాటకొస్తే… మహేష్ చేయబోతున్న వంశీ పైడిపల్లి సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని మహేష్ బాబే స్వయంగా సెలవిచ్చారు. ఇక అ తర్వాత లిస్టులో ఉన్న సుకుమార్, సందీప్ రెడ్డిల గురించి చెప్పనవసరం లేదు. ‘ప్రయోగం’ అనే పేరుతో రిలీజ్ చేస్తే ఏమవుతుందో అనుకుంటారని, కమర్షియల్ సబ్జెక్ట్ అని చెప్తూనే ‘ప్రయోగాలతో’ కెరీర్ ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నాడు ప్రిన్స్.