Bharat-Ane-Nenu---Mahesh-Babuప్రిన్స్ మహేష్ బాబు నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ‘భరత్ అనే నేను’ తొలి బహిరంగ సభకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదిక అవుతోంది. ముందుగా వినిపించిన సమాచారం ప్రకారమే ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుండి ‘భరత్ అనే నేను’ బహిరంగ సభ జరగనుందని ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ధృవీకరించింది. దీంతో ప్రిన్స్ అభిమానుల నిరీక్షణకు తెరపడినట్లయ్యింది.

అయితే ఈ వేదిక సంచలనాలకు నాంది కాబోతోందా? అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాలలో ఊపందుకుంది. ఇటీవల పవన్ ‘జనసేన’ ఆవిర్భావ సభ ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించగా, ‘భరత్ అనే నేను’ బహిరంగ సభ సినీ ఇండస్ట్రీలో సహృదయ వాతావరణానికి వేదిక అవుతుందని తెలుస్తోంది. అవును… ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ఎవరు రాబోతున్నారు? అనేది ప్రకటన చేయలేదు గానీ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, త్రివిక్రమ్ లు హాజరు కాబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం హల్చల్ చేసింది.

‘రంగస్థలం’ విడుదల తర్వాత మహేష్ బాబు తరపున రామ్ చరణ్ ను అభినందించిన నమ్రత, ఈ బహిరంగ సభకు ఆహ్వానం కూడా పలికినట్లు వార్తలు హల్చల్ చేసాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా వ్యక్తిగత ఆహ్వానం అందించే పనిలో ఉన్నారట. ఇందులో వాస్తవం ఎంత ఉందో అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు గానీ, నిజంగా ఇది జరిగితే… అభిమానుల మధ్య ఉన్న ‘విద్వేషపూరిత’ వాతావరణానికి కాస్త ‘బ్రేక్’ వేసినట్లే భావించవచ్చు. అందుకు వేదికగా ఈ భరతుడి బహిరంగ సభ నిలవాలని మాత్రం ఆశిద్దాం.