Benz Circle Flyover - Kesineni Naniనారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి విజయవాడ ముఖచిత్రం క్రమక్రమంగా మారుతోంది. ఒకప్పుడు మురికి నీళ్ళు కనిపించిన ప్రాంతాలలో ప్రస్తుతం పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. సుందరవనంగా రూపుదిద్దుకుంటున్న విజయవాడ ప్రజలు ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి, రాజధాని ప్రాంతం సమీపం అయిన తర్వాత, చంద్రబాబు విజయవాడ వచ్చిన తర్వాత ట్రాఫిక్ రద్దీ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ఇందులోనూ ప్రధానంగా రెండు ప్రాంతాలలో తీవ్ర ఇబ్బందులుగా మారగా, అందులో ఒకటి… కనకదుర్గమ్మ గుడి వద్ద కాగా.., మరొకటి బెంజ్ సర్కిల్ ప్రాంతంలో..!

దుర్గమ్మ గుడి వద్ద ట్రాఫిక్ ను నియత్రించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. కృష్ణా పుష్కరాల నాటికి ఈ ఫ్లై ఓవర్ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, బహుశా దసరా నాటికి ఖచ్చితంగా పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక, మరొక ప్రాంతమైన బెంజ్ సర్కిల్ ప్రాంతంలో కూడా ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేసారు. కానీ, పనులైతే ప్రారంభం కాలేదు. దానికి ప్రధాన కారణం… ఇంతకు ముందు రూపొందించిన ఫ్లై ఓవర్ ప్లానింగ్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేలా కనపడకపోవడమే.

నగర ప్రజల ట్రాఫిక్ సమస్యలు అంచనా వేసిన ఎంపీ కేశినేని నాని, ఇంతకుముందు ఉన్న ఫ్లై ఓవర్ పొడవును దాదాపుగా 800 మీటర్ల వరకు పెంచారు. గతంలో కేవలం 618 మీటర్ల ఫ్లై ఓవర్ కు మాత్రమే అనుమతి లభించగా, తాజా సవరణలతో 1438 మీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం కానుంది. అంటే బెంజ్ సర్కిల్ నుండి రమేష్ హాస్పిటల్ వంతెన వరకు ఈ నిర్మాణం జరగనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం ఎంపీ నాని పట్టుదల వలనే జరిగినట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. పెరిగిన పొడవుతో ఈ ప్రాజెక్ట్ కు అయ్యే వ్యయం మొత్తం 860 కోట్లుగా నిర్ధారణ అయ్యింది.

గతంలో వన్ టౌన్ ప్రాంతంలో నిర్మించిన ఫ్లై ఓవర్ కూడా ప్రజల కష్టాలను తీర్చకపోగా, సరికొత్త విమర్శలను ఎదుర్కొంది. బహుశా గత ప్లాన్ అయితే బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కూడా అలాంటి అనుభూతులనే ప్రజల నుండి చవిచూడాల్సి వచ్చేది. కట్టడం ప్రాధాన్యత కాదు, ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించాలి కదా అన్న ప్రభుత్వ సదుద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ కొత్త రూపు సంతరించుకుని ప్రజల మన్నన పొందుతోంది.