ravi teja bengal tigerకమర్షియల్ కధలను నమ్ముకుంటే చాలు… అవే కాసులు కురిపిస్తాయన్న నమ్మకంతో దర్శకుడు సంపత్ నంది తన కధలను రాసుకుంటున్నట్లుగా కనపడుతోంది. మొదటి చిత్రం ‘ఏమైంది ఈ వేళ’ చిత్రాన్ని మినహాయిస్తే, ‘రచ్చ, బెంగాల్ టైగర్’ చిత్ర కధల విషయంలో ఇదే ఫార్ములాను అప్లై చేసారు. ‘రచ్చ’ సినిమాలో బ్రహ్మి పాత్ర ద్వారా కొంత కామెడీ సృష్టించి కలెక్షన్లతో నెట్టుకొచ్చిన సంపత్, ‘బెంగాల్ టైగర్’లో ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీ ద్వారా ఆ ప్రయత్నం చేయాలని చూసారు. అయితే ‘బెంగాల్ టైగర్’ విషయంలో సంపత్ అంచనాలు తారుమారయ్యాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

తొలి వీక్ ముగిసే సమయానికి దాదాపు 14 కోట్ల షేర్ ను మాత్రమే ‘బెంగాల్ టైగర్’ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ‘లోఫర్’ మినహా మరే తెలుగు సినిమా లేనప్పటికీ, ఈ వారంలో విడుదలైన ‘బాజీరావు మస్తానీ, దిల్ వాలే’ చిత్రాల ప్రభావం కూడా టాలీవుడ్ లో బాగానే కనపడుతోంది. దీంతో ‘బెంగాల్ టైగర్’ కలెక్షన్లు బాగా మందగించాయని, సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టడం కష్టంగా మారిందని ‘కృష్ణానగర్’లో హల్చల్ చేస్తున్న సంగతులు. వచ్చేవారం నుండి వరుస సినిమాల విడుదలలు ఉండడంతో ‘బెంగాల్ టైగర్’కు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలివుంది.