Ben Stokes, Eoin Morgan England Vs Australia2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ‘డూ ఆర్ డై’ మ్యాచ్ లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు, విజయమే లక్ష్యంగా బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, భారీ స్కోర్ కు బాటలు వేసే విధంగా ఓపెనర్ ఫించ్ (68 పరుగులు) షాట్లతో విరుచుకుపడ్డారు. అలాగే కెప్టెన్ స్మిత్ (56 పరుగులు) కూడా మంచి సహకారం అందించడంతో, 300 పరుగులకు పైచిలుకు ఖాయమని భావించారు. అయితే 42వ ఓవర్లో మాక్స్ వెల్ 5వ వికెట్ గా వెనుదిరిగిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు వికెట్ల పతనం ప్రారంభమైంది.

మరో ఎండ్ లో హెడ్ (71 పరుగులతో నాటౌట్) నిలకడగా ఆడుతున్నప్పటికీ, స్పిన్నర్ రషీద్ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 300 దాటుతుందని భావించిన స్కోర్ బోర్డు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 277 పరుగులు మాత్రమే చేయగలిగింది. అది కూడా చివరి ఓవర్లలో హెడ్ భారీ షాట్ల వలన! దీంతో రెట్టించిన ఉత్సాహంతో లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 35 పరుగులకే 3 టాపార్డర్ రాయ్, హేల్స్, రూట్ వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఈ తరుణంలో క్రీజులో ఉన్న మోర్గాన్ – స్టోక్స్ లు వెన్ను చూపకుండా బ్యాటింగ్ చేయడంతో… కంగారులు నిజంగా కంగారు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా కెప్టెన్ మోర్గాన్ భారీ సిక్సర్లతో మోత మోగించడం విశేషం. మూడు టాపార్డర్ వికెట్లు పడిన తర్వాత కూడా 26.1 ఓవర్లలో 159 పరుగులు నాలుగవ వికెట్ కు జోడించారంటే… మోర్గాన్ – స్టోక్స్ ఏ విధంగా బ్యాటింగ్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. 81 బంతులను ఎదుర్కొన్న మోర్గాన్ 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు చేసాడు.

మరో ఎండ్ లో ఉన్న బెన్ స్టోక్స్ కూడా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్ లో ఓ సెంచరీ, ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో ఓ సెంచరీ నమోదు చేసిన స్టోక్స్, అదే ఫాంను ప్రదర్శిస్తూ… 109 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మోర్గాన్ – స్టోక్స్ భాగస్వామ్యంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపుకు తిరగగా, మోర్గాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ కూడా బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ను కనపరిచాడు. 40.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసిన తరుణంలో వరుణుడు ప్రత్యక్షం కావడంతో మ్యాచ్ ముగిసింది.

దీంతో డక్ వర్త్ లూయిస్ సిద్ధాంతం ప్రకారం ఇంగ్లాండ్ జయకేతనం ఎగురవేసినట్లుగా ప్రకటించారు. సరిగ్గా వరుణుడు రావడానికి ముందు బంతినే బౌండరీగా మలిచి సెంచరీ పూర్తి చేసుకున్నాడు బెన్ స్టోక్స్. దీంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఆస్ట్రేలియా అవుట్ కాక తప్పలేదు. ఆసీస్ ఆడిన తొలి రెండు మ్యాచ్ లు వరుణుడు కారణంగా పూర్తిగా రద్దు కాగా, ఈ మ్యాచ్ లో ఓటమి చవిచూడడంతో ఆసీస్ ఖాతాలో కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మరో వైపు కివీస్ పై విజయకేతనం ఎగురవేసిన బంగ్లాదేశ్ జట్టు 3 పాయింట్లతో సెమీ ఫైనల్ కు చేరుకుంది.

2015 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ను ఇంటికి పంపించిన ట్రాక్ రికార్డు ఉన్న బంగ్లాదేశ్ జట్టును ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ కు పంపించడంతో పరోక్షంగా అదే ఇంగ్లాండ్ జట్టు దోహదపడినట్లయ్యింది. అలాగే గత ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన రెండు జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లలోనే వెనుదిరగడం విశేషం. ‘యాషెస్ సిరీస్’తో ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య శత్రుత్వాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు, ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఎక్కువమంది ప్రేక్షకులు మైదానానికి విచ్చేసారు.