తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త పద్ధతి మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమం చేస్తే వెంటనే ఏదో విధంగా దానిపై నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తారు. చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షకు కూర్చుంటే వల్లభనేని వంశీతో ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టించారు.

తాజాగా టీడీపీ నూతన ఆఫీసుకు గృహప్రవేశం చేస్తే నెల్లూరులో ఆ పార్టీ సీనియర్ నేత బీద మస్తాన్ రావు చేత పార్టీకి రాజీనామా చేయించారు. అంతటితో ఆగలేదు. ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి తో హైకోర్టు లో పిటీషన్ వేయించారు. ఏకంగా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. దానిని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ పిటీషన్ వేశారు.

ఈ చర్యల ద్వారా ప్రజలలో టీడీపీని పల్చన చెయ్యాలని వ్యూహంగా ఉన్నా దీని వల్ల అధికార పక్షానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కొత్త కార్యాలయం గృహ ప్రవేశం చేసినా ఓర్వలేని స్థితిలోకి వైఎస్సార్సీపీ ఉందని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇటువంటి ఒపీనియన్ అధికార పక్షానికి మంచిది కాదు.

ఇప్పటికే చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను కూల్చడం, చంద్రబాబు ఇంటిని కూల్చడానికి నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు ప్రభుత్వ ఇమేజ్ కు చేటు చేసేవిగా ఉన్నాయి. ప్రజలలోకి టీడీపీ ఆ విషయాన్ని బలంగా తీసుకుని వెళ్లగల్గితే వచ్చే స్థానిక ఎన్నికలలో ఆ పార్టీ కి కొంత మేర సింపతీ వర్క్ అవుట్ కావొచ్చు. జాగ్రత్త పడితే జగన్ కే మంచిది.