BCCI to Change team india coachesసెమీస్ లోనే టీమిండియా వరల్డ్ కప్ కాంపెయిన్ ముగిసిపోవడంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. టీమిండియా కోచింగ్ టీంను పూర్తిగా ప్రక్షాళన చెయ్యడానికి పూనుకుంది. రవిశాస్త్రితోపాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ల కాంట్రాక్ట్‌ను మరో 45 రోజులు పొడిగించారు. అయితే ఆ పోస్టులకు ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వాహించింది. వరల్డ్‌కప్‌ వైఫల్యం అనంతరం తమ కాంట్రాక్టులు పూర్తికావడంతో ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసు తప్పుకొన్నారు.

కోచ్‌లతోపాటు టీమ్‌ మేనేజర్‌ పోస్టుకు కూడా దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది. ఆలోపే కోచ్‌ను ఎంపికచేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అనిల్‌ కుంబ్లే తర్వాత 2017లో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి నియమితుడయ్యాడు. అతడి హయాంలో ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ మినహా భారత్‌ ఎటువంటి మేజర్‌ టోర్నీలు గెలవలేదు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నా ఫలితాలు రాబట్టలేకపోవడంతో బీసీసీఐ రవి శాస్త్రి కాంట్రాక్టును పునరుద్దరించలేదు.

మళ్లీ రవిశాస్త్రి కోచ్ గా కొనసాగాలని అనుకున్నా… ఆయన కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరోసారి ఎంపిక చేసే అవకాశం లేకపోవడంతో ఆయన ఆ ప్రయత్నం కూడా చేసే అవకాశం లేదని సమాచారం. మరోవైపు త్వరలో జరిగిన వెస్ట్ ఇండీస్ సిరీస్ కు సీనియర్లకు రెస్టు ఇచ్చి యువకులతో కూడిన టీమ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వన్డే కెప్టెన్ గా కోహ్లీని మార్చి అతడిస్థానంలో రోహిత్ శర్మను నియమిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.