bbc-channel-media- news
ప్రపంచ మీడియా సంస్థలలో బీబీసీ ఛానల్ కున్న ప్రత్యేకత తెలియనిది కాదు. సదరు ఛానల్ లో ఓ వార్త వచ్చిందంటే దానికి ఎక్కడ లేని ప్రాముఖ్యత లభించడం సర్వసహజం. మరి అంతటి ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకున్న బీబీసీ, ఇండియాలో మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషలతో పాటు తెలుగు నేలపై కూడా అడుగుపెట్టింది. ఉత్తరాది ప్రసారాలు పక్కన పెడితే, ఏ భాషలోనూ లేనన్ని మీడియా సంస్థలు తెలుగునాట ఉన్న విషయం తెలిసిందే. దీంతో బీబీసీ ప్రజంటేషన్ ఏ విధంగా ఉండబోతోంది అన్న ఆసక్తి వీక్షకులలో ఉంది.

అయితే బీబీసీ ఓ ప్రత్యేక ఛానల్ అంటూ ఏమి లేకుండా సోషల్ మరియు వెబ్ మీడియాల ద్వారా ఎక్కువ సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా కాగా, రోజు మొత్తమ్మీద ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ‘బీబీసీ ప్రపంచం’ పేరుతో రాత్రి వేళల్లో ఓ బులిటెన్ ప్రసారం చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలుగు మీడియా సంస్థలన్నీ ఏదొక రాజకీయ పార్టీలతో లింకులు ఉన్న దరిమిలా, బీబీసీ కధనాలు ఎలా ఉంటాయో చూడాలి. అయితే వార్తా విభాగంలో ఈటీవీ ఛానల్ కున్న పేరు ప్రఖ్యాతల రీత్యా బీబీసీ కూడా దానినే అనుసరించే అవకాశముందని తెలుస్తోంది.