bathuku-jataka-bandi-bathuku-jataka-bandi-threatsసామాన్యుల జీవితాలలో సంభవించే కుటుంబ ఒడిదుడుకులను ప్రపంచానికి చాటి చెప్పి, వాళ్ళ జీవితాల పరువు తీసే కార్యక్రమాలలో ఒకటిగా బుల్లితెరపై ప్రసారమయ్యే ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమంపై తాజాగా సంచలన ఆరోపణలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు జడ్జిల కంటే కూడా తామే మెరుగన్న రీతిలో సాగే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువైపోయిన నేపధ్యంలో… పోటీతత్వం మరింతగా పెరిగిపోయింది. దీంతో ఓ కుటుంబంలో ఎక్కడ గొడవ అవుతుందో… ఎవరిని రోడ్డు మీద నిలబెట్టాలో అన్న రీతిలో బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందన్న టాక్ తాజా ఆరోపణలతో వ్యక్తమవుతోంది.

‘బతుకు జట్కా బండి’ కార్యక్రమానికి రావాలంటూ జీవితా రాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శులు తరచూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితుల కథనం ప్రకారం… పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన ఆటోడ్రైవర్ పి.కొండ (29), పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జ్యోతిని 2005లో వివాహం చేసుకున్నాడు. వీరికి 9 సంవత్సరాల పాప సంపూర్ణ అనే కుమార్తె కూడా ఉంది. రెండో కాన్పు సమయంలో జ్యోతి అనారోగ్యం పాలవడంతో బాబు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది.

ఈ క్రమంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరూ విడిపోయారు. ఈ సమయంలో భార్య జ్యోతికి కొండ లక్ష ఇచ్చాడు. అయితే ఇటీవల బుల్లితెరపై ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమాన్ని చూస్తున్న జ్యోతి తన సమస్య పరిష్కారం కోసం జీవిత రాజశేఖర్‌ను ఆశ్రయించింది. దీంతో జీవిత వ్యక్తిగత కార్యదర్శులు అయిన కిరణ్, మరో మహిళ కలిసి కొండ, అతడి తమ్ముడికి ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా తరచూ ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించారని, వారి బెదిరింపులను రికార్డు చేసిన కొండ, చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి జీవిత వ్యక్తిగత కార్యదర్శులపై ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.