banglore royal challengers rcb has chances winning ipl 2016 trophyఒక్కసారి ప్రస్తుత సీజన్ నుండి 2015 ఐపీఎల్ సీజన్ కు వెళితే… ఆడిన తొలి 7 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలను మాత్రమే సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, తదుపరి 7 మ్యాచ్ లలో 6 మ్యాచ్ లను గెలుపొంది ప్లే ఆఫ్స్ లో రెండవ స్థానంలో నిలిచింది. అలాగే క్వాలిఫైయర్ లో నేరుగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన ముంబై ఇండియన్స్ ఏకంగా ట్రోఫీని కూడా ఎగురవేసుకుపోయారు. ఇది అందరికీ తెలిసిన చరిత్ర.

ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు పరిస్థితి అదే. ఈ సీజన్లో సగం మ్యాచ్ లు అయిపోయే సమయానికి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న జట్టు, మొత్తం మ్యాచ్ లు పూరయ్యే సమయానికి ఏకంగా 2వ స్థానంలో నిలిచింది. ఆదివారం నాడు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడ్డ బెంగుళూరు జట్టు మరోసారి కోహ్లి అండ చూసుకుని అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్స్ కు చేరింది. మెరుగైన రన్ రేట్ తో కోల్ కతా, సన్ రైజర్స్ ను వెనక్కి నెట్టింది. దీంతో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ బెంగుళూరు మధ్య జరగనుంది.

2015 మాదిరి హిస్టరీ రిపీట్ అయితే… అప్పుడు ముంబై ఇండియన్స్ మాదిరి ఇప్పుడు బెంగుళూరుదే టైటిల్ అని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. అయితే, వీక్షకులైతే ఇప్పటికే బెంగుళూరుదే టైటిల్ అని డిసైడ్ అయిపోయారు. ప్రస్తుతం ఆ జట్టు ఉన్న భీకర్ ఫాం చూస్తుంటే, ప్రత్యర్ధి ఎవరైనా తుక్కుతుక్కు చేసి పంపిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా ఈ సీజన్లో 1000 పరుగులు నమోదు చేయడానికి కొద్ది దూరంలో ఉండి ప్రత్యర్ధి జట్లను బెంబేలేత్తిస్తుండగా, డివిలియర్స్, గేల్, వాట్సన్, రాహుల్ పేర్లు బౌలర్లకు కాలరాత్రులను మిగులుస్తున్నాయి.

మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ 24వ తేదీన గుజరాత్ వర్సెస్ బెంగుళూరు జట్లు తలపడనుండగా, 25వ తేదీన సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా జట్ల మధ్య ‘ఎలిమినేటర్’ మ్యాచ్ జరగనుంది. 27వ తేదీన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓడిన జట్టు మరియు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్లు తలపడనున్నాయి. ఇక, ఫైనల్ మ్యాచ్ 29వ తేదీన వచ్చే ఆదివారం నాడు జరగనుంది. గుజరాత్, బెంగుళూరు జట్ల రెండు అడుగుల దూరంలో ఉండగా, హైదరాబాద్, కోల్ కతా జట్లకు మూడు అడుగుల దూరంలో ఐపీఎల్ టైటిల్ ఉంది.