Boycott - Bangarajuఎప్పుడైతే తన సినిమా వరకు ఇబ్బంది లేదని నాగార్జున “బంగార్రాజు” వేదికపై సినిమా టికెట్ల అంశంపై స్పందించారో, ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రోలింగ్ కు ‘కింగ్’ నాగార్జున గురయ్యారు. ఆ తర్వాత ఎంత వివరణ ఇచ్చుకున్నప్పటికీ, “బాయ్ కాట్ బంగార్రాజు” అన్న నినాదాన్ని సోషల్ మీడియా జనులు అందుకున్నారు.

మరి ఆ నినాదం ప్రభావం “బంగార్రాజు” సినిమాపై పడిందా? అంటే ‘ఇసుమంత కూడా లేదన్న’ సమాధానాన్ని ‘బంగార్రాజు’ ఓపెనింగ్ కలెక్షన్స్ చెప్పకనే చెప్తున్నాయి. నాడు నాగార్జున మాటలకు సినీ అభిమానులు హర్ట్ అయిన మాట వాస్తవమే, అలాగే అదే సినీ అభిమానులు నేడు నీరాజనాలు పలుకుతున్న మాట వాస్తవమే.

ఇక్కడే తెలుగు సినీ ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. సినిమానే ప్రధాన వినోదంగా భావించే టాలీవుడ్ ఫ్యాన్స్, ఒక్కసారి సినిమా నచ్చితే దానిని నెత్తిన పెట్టుకుంటారన్న విషయం “బంగార్రాజు” మరోసారి నిరూపించింది. రిలీజ్ కు ముందు ఏం జరిగినా, సినిమా నచ్చితే వాటిని మనసులో పెట్టుకోరన్న విషయం స్పష్టమైంది.

ఒక సినిమా నచ్చితే, అది డబ్బింగ్ బొమ్మా? హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు? అన్న విషయాలకు తావు లేకుండా భారీ విజయాలను అందివ్వడం ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులకే చెందుతుందని చెప్పవచ్చు. అందువల్లనే పొరుగున ఉన్న ఇతర భాషల హీరోల ప్రతి సినిమా కూడా తెలుగునాట డబ్బింగ్ రూపంలో ప్రత్యక్షం అవుతోంది.

సినిమా బాగుంటే దాని సక్సెస్ ను ఎవరూ ఆపలేరు, అలాగే అదే సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతే, ఎంత పబ్లిసిటీ ఇచ్చినా, ఏ రేంజ్ హీరో అయినా నిర్మొహమాటంగా తిప్పి కొడతారు. ఇదే విషయం టికెట్ ధరల విషయంలో కూడా అప్లై అవుతుంది. సినిమా నచ్చితే 200 పెట్టి అయినా చూస్తారు, లేదంటే 10 రూపాయలకు కాదు, ఫ్రీగా చూపించినా తిప్పి కొడతారు.