Bandla Ganesh - Ram Charan Vs Balakrishnaమెగా ఫ్యామిలీ హీరోలకు అవార్డులలో అన్యాయం జరుగుతోంది అని బన్నీ వాసు చేసిన కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలే లేపాయి. అంతలా హాట్ టాపిక్ అయిన ఈ విషయంపై ప్రముఖ మీడియా ఛానల్ చర్చ చేపట్టగా, లైన్ లోకి వచ్చిన బన్నీ వాసు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ హీరోలకు గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతోందని గళం విప్పారు.

ఇక ఈ చర్చలో పాల్గొన్న నిర్మాత బండ్ల గణేష్ అయితే ఒకడుగు ముందుకు వేసి ‘లెజెండ్’ సినిమాకు గానూ నందమూరి బాలకృష్ణకు అవార్డు రావడాన్ని తప్పుపట్టారు. ఈ అవార్డులన్నీ ఒక రూమ్ లో కూర్చుని తమకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చుకున్నారని, వీటిని తానూ “సైకిల్ అవార్డ్స్”గా పరిగణిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సదరు మీడియా ప్రతినిధి కూడా బండ్ల వ్యాఖ్యలను సవరించే పరిస్థితి నెలకొంది.

ఒక ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను అలా కించపరచడం తగదని చెప్పడంతో, తాను చేసిన “సైకిల్ అవార్డ్స్” అన్న పదాన్ని వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. అయితే మెగా హీరోలకు ఎక్కడ అన్యాయం జరిగింది? ఏ ఏడాదిలో మెగా హీరోకు ఉత్తమ నటుడిగా ఇవ్వాల్సి ఉంది? అని ప్రశ్నించగా, ఒక శాసనసభ సభ్యుడిగా కమిటిలో కూడా ఉన్న బాలకృష్ణకు అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బండ్ల గణేష్, ఆ ఏడాది “గోవిందుడు అందరి వాడేలే” సినిమాకు గానూ రామ్ చరణ్ కు ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ముందుగా ‘మనం’ సినిమాకు ఇవ్వాల్సి ఉందని చెప్పగా, దానికి గానూ పునర్జన్మలు తదితర అంశాలు ఉంటే జూరీ పరిగణనలోనికి తీసుకోదని చెప్పడంతో, 2014కు ఏడాదికి గానూ ‘లెజెండ్’ బాలయ్య అభినయానికి కాకుండా ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాలో రామ్ చరణ్ కనపరిచిన అద్భుతమైన అభినయానికి ఇవ్వాలని సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు.

అయితే ఇది మరీ హాస్యాస్పదనమైన కామెంట్స్ గా మారాయి. బాలకృష్ణకు ఇవ్వడం కరెక్టో కాదో పక్కన పెడితే, రామ్ చరణ్ కు ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలు… బహుశా “మెగా భక్తి”ని చూపించుకోవడానికి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలుగా కనపడుతున్నాయి తప్ప, అందులో అర్ధం లేదని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎంత “మెగా భక్తి” ఉన్నా… మరీ ఇంత వితండ వాదన ఉండకూడదు అన్నది వీక్షకుల భావన.