Bandla ganesh bheemla nayak eventపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని ప్రదర్శించడంలో ఒకప్పటి కమెడియన్, ప్రస్తుత నిర్మాత బండ్ల గణేష్ స్టైల్ ప్రత్యేకమైంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం కంటే బండ్ల ఇచ్చే ఎలివేషన్స్ కోసమే కొంతమంది అభిమానులు నిరీక్షిస్తుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా పవన్ ఫ్యాన్స్ ను బండ్ల తన స్పీచ్ లతో పడేస్తారు.

కానీ ఈ సారి “భీమ్లా నాయక్” వేడుకకు బండ్ల గణేష్ కు ఆహ్వానం వెళ్లినట్లుగా లేదు. అందుకే ఆదివారం నాడు చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ కావడంతో, మళ్ళీ నేడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ట్వీట్లు వేసుకుంటూ వచ్చారు. “ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుందని” ఆదివారం నాడు ఓ ట్వీట్ వేసాడు బండ్ల.

ఇది ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ గురించేనని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఆ తర్వాత “ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా బాధపడకండి, అలాంటి వారు ఖరీదైన వాటిని తిరస్కరించి, చవకైన వాటిని ఎంచుకుంటారు, వారికి మీ విలువ తెలియదు, ఇది నిజం” అంటూ మరో ట్వీట్ వేసారు. ఇదంతా కూడా ‘భీమ్లా’ ఈవెంట్ చుట్టూనే తిరుగుతోందని అభిమానుల నడుమ చర్చ సాగింది.

ఇక పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ తనదైన శైలిలో ట్వీట్లు వేసారు. “సూర్యుడి తేజస్సుకు… చంద్రుడి చల్లదనానికి…పవన్ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు. జై పవన్ కళ్యాణ్ దేవర” అని ఒకటి, “పవన్… అంటే వాయువు. అది లేని చోటు భూమిపై లేదు. పవన్ అభిమానులు లేని చొటు కూడా లేదు. పవన్ పై అభిమానం కూడా వాయువులా అనంతం.జై పవన్ కళ్యాణ్ దేవర” అని మరో ట్వీట్ వేసి అభిమానులను ఉత్తేజపరిచారు.

వీటన్నింటితో పాటు సోషల్ మీడియాలో బండ్ల గణేష్ – ఓ అభిమాని నడుమ జరిగిన సంభాషణ కూడా వైరల్ అవుతోంది. ఈ వేడుకకు వెళ్లి స్పీచ్ ఇవ్వడానికి అద్భుతంగా రాసుకున్నానని, అయితే త్రివిక్రమ్ వలన ఈ వేడుకకు తనకు ఆహ్వానం అందలేదని, మీ అభిమానులంతా ఈ ఈవెంట్ లో బండ్లన్న కావాలి అని గట్టిగా అరవండి, నేను పక్కనే ఉంటా, పరిగెత్తుకు వచ్చేస్తా అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.