bandla-ganesh-14-days-remand-pvpసినీ నిర్మాత బండ్ల గణేష్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టు అయ్యారు. అయితే ఆయన తన అనుచరులతో కలిసి ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయించారు అనే కేసులో అరెస్టు అయ్యారని అంతా భావించారు. అయితే గణేష్ ఒక చెక్‌ బౌన్స్‌ కేసులో అరెస్ట్‌ అయినట్టు పోలీసులు తెలిపారు.

2014 అక్టోబర్‌ 1న కడపకు చెందిన మహేశ్‌ అనే వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్‌ 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వకుండా గణేష్‌ ముప్పుతిప్పలు పెట్టాడు. చెక్‌ కూడా బౌన్స్‌ కావడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదైంది. అయితే కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో బండ్ల గణేష్‌పై కోర్టు సెప్టెంబర్‌ 18న అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది.

ఈ కేసులోనే ఆయన అరెస్టు అయ్యారు. ఆ తరువాత పోలీసులు కడప జైలుకు తరలించారు. కాగా కేసు విచారణ నిమిత్తం బండ్లను పోలీసులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి కడపకు తీసుకువచ్చి జిల్లా మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. బండ్ల గణేష్‌కు న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

ఆర్ధిక వివాదాలలో చిక్కుకోవడం బండ్ల కు ఏమీ కొత్త కాదు. గతంలో హీరో సచిన్ జోషి, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు పొట్లూరి వరప్రసాద్ తో కూడా ఆయన ఇటువంటి వివాదాలే ఉన్నాయి. వీటికరణంగా బండ్లతో సినిమాలు చెయ్యడానికి హీరోలు ఎవరూ ముందుకు రావడం లేదు. కాగా ఆయన మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా నటుడిగా కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నారు.