Bandi Sanjay Kumar fires on KCR governmentతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియా చిట్ చాట్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “అమ‌ర వీరుల ఆశ‌య సాధ‌న‌కు విరుద్ధంగా తెలంగాణ‌లో కేసీఆర్‌ పాల‌న సాగుతోంది. కొత్త రాష్ట్రం సిద్దించాక కేవలం క‌ల్వ‌కుంట్ల‌, ఒవైసీ కుటుంబాలే ల‌బ్ధి పొందాయి,” అని సంజయ్ చెప్పుకొచ్చారు.

“2023 ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపేస్తాం. తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివ‌రాల‌ను పూర్తిగా సేక‌రించాం…. ఇప్ప‌టికే తెరాస‌కు సంబంధించిన 18 మంది ముఖ్య‌నేత‌ల‌పై ఎలా ముందుకు వెళ్ళాలి అనేదాని మీద న్యాయ‌ప‌ర‌మైన స‌లహాలు తీసుకుంటున్నాం,” అని సంచలన వ్యాఖ్యలు చేసారు ఆయన.

సహజంగా ఇటువంటి వ్యాఖ్యలు అన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తాయి. అయితే సంజయ్ మరీ ముఖ్యంగా 18 మంది అని చెప్పి నిజంగానే అటువంటి చిట్టా ఏమైనా ఉందా అనే ఆసక్తి రేకెత్తించారు. ఒకవేళ అటువంటి లిస్టు నిజంగానే ఉంటే… కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపేసేందుకు 2023 వరకు కూడా వేచి చూడక్కర్లేదు.

గతంలో కూడా ప్రభుత్వాన్ని కూలదోస్తాం అని బండి పలుమార్లు చెప్పుకొచ్చారు. మరోవైపు… తెరాస అసంతృప్త నేత, తాజా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వారం రోజుల్లో పార్టీలో చేరే అవకాశం ఉంద‌ని… ఎలాంటి హామీ లేకుండానే ఈట‌ల బీజేపీలో చేరుతున్న‌ట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు.. పార్టీ సిద్ధాంతాలతో పాటు ప్ర‌ధాని పాల‌న న‌చ్చి ఈట‌ల బీజేపీలో చేరుతున్నార‌న్నారు.