Bandi Sanjay Kumar comments on kcrఎంఐఎంనే తమ ప్రధాన ప్రచార అంశంగా చేసుకుని జీహెచ్ఎంసి ఎన్నికలలో ప్రచారం చేస్తుంది బీజేపీ. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పనిని తన భుజాలకు ఎత్తుకున్నారు. ప్రచారం సందర్భంగా తెరాస ఎంఐఎం పొత్తు పెట్టుకున్నారు అనే అంశం మీద పదే పదే విమర్శలు చేస్తున్నారు ఆయన.

దేశద్రోహ పార్టీతో పొత్తుపెట్టుకుని తిరుగుతున్న ముఖ్యమంత్రికి సిగ్గుండాలి, 15 నిముషాల సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతామని ఎంఐఎం పార్టీ వ్యాఖ్యలు చేసిందని, హిందూ దేవుళ్లను అవమానపరిచిందని సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇదంతా బానే ఉంది గానీ భారత రాజ్యాంగం కింద నమోదైన ఏ పార్టీ అయినా దేశద్రోహి పార్టీ ఎలా అవుతుంది?

ఒకవేళ ఎంఐఎం దేశద్రోహి పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది? ఆ విషయం అలా పక్కన పెడితే… గతంలో ఇలానే దేశద్రోహి పార్టీ అని ఆరోపించిన కాశ్మీర్ కు చెందిన పీడీపీ తో బీజేపీ పొత్తు పెట్టుకుని ప్రభుత్వం కూడా స్థాపించిన సంగతి తెలిసిందే కదా? ఇప్పుడు కేసీఆర్ మీద చేసే ప్రతీ ఆరోపణ మోడీ విషయంలో కూడా నిజమే అవుతుంది కదా?

కాబట్టి బండి సంజయ్ ఏం చెప్పదలచుకున్నారు? ఏది ఏమైనా తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న బీజేపీ ప్రజా సమస్యలను వదిలేసి… హిందూ ముస్లిం… పాకిస్తాన్ వంటి అంశాల గురించే పదే పదే మాట్లాడటం శోచనీయం. అయితే ఓటర్లు ఈ ఎన్నికల స్ట్రాటజీని ఏ విధంగా చూస్తారో చూడాలి.