bandi sanjay kumar Telangana BJP Presidentతెలంగాణలో సక్సెసైన మత స్ట్రాటజీనే ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ ఉపయోగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రామతీర్థం సెంటర్ గా మత కల్లోలం రేపి తిరుపతి ఉపఎన్నికలో లాభపడాలని చూస్తుంది. మొన్న ఆ మధ్య తిరుపతి ఉపఎన్నిక… బైబిల్ పార్టీకి భగవద్గీత పార్టీకి జరిగే పోరు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు.

తాజాగా బీజేపీ ఏపీ సహా ఇంఛార్జ్ ఏపీలో రామ్ వర్సెస్ రోమ్ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. రామతీర్థానికి వెళ్ళడానికి విశాఖ వచ్చిన ఆయనకు వెళ్ళడానికి పర్మిషన్ లేదని పోలీసులు నోటీసులు జారీ చేశారట. కేవలం యాభై మందితో వెళ్ళాలని పోలీసులు సూచించారట.

అయితే విజయసాయి రెడ్డి, చంద్రబాబులను ఎందుకు వేల మందితో వెళ్ళనిచ్చారు మాకు ఎందుకు ఆకాంక్షలు పెడుతున్నారు అని సునీల్ దేవధర్ ప్రశ్నించారు. తమని తాము పాండవులుగానూ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ వారిని కౌరవులుగా అభివర్ణించారు. పైగా విజయసాయి రెడ్డి, చంద్రబాబులను అహిరావణుడు, మహిరావణుడిగా పిలుస్తూ తమని తాము హిందూ ఉద్ధారకులుగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారు.

ఏది ఏమైనా ఇప్పటివరకు కులాల మధ్య కుంపట్లతో సతమతం అవుతున్న ఏపీలో మత రాజకీయాలు కూడా మొదలయ్యిపోయాయి. పైగా మిగతా వారందరినీ దుర్మార్గులుగా… వేరే మతవాదులుగా చిత్రీకరించడం మొదలుపెట్టేశారు. రాజకీయ నాయకుల మీద విమర్శలు కూడా పక్కన పెడితే… బైబిల్ X భగవద్గీత, రామ్ X రోమ్ అంటూ ఇరుమతాలకు చెందిన సామాన్యుల మధ్య కూడా చిచ్చు రేపే పనిలో పడ్డారు.