Bandi-Sanjay-TRS-MLAదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసుల ఉచ్చులో చిక్కుకొన్న ముగ్గురు బిజెపి ప్రతినిధులు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉండగా, ఆ నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ అధికార నివాసం ప్రగతి భవన్‌లో బందీలుగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి.

ఈ వ్యవహారమంతా కేసీఆర్‌ కధ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌లోనే జరిగిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. కనుక ఆయనే ఆ నలుగురినీ బయట తిరగనీయకుండా, ఎవరినీ కలవనీయకుండా ప్రగతి భవన్‌లో నిర్బందించి ఉండవచ్చని బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడే బిజెపి కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆ నలుగురి నియోజకవర్గాలలో “మా ఎమ్మెల్యేలు కనబడుటలేదు” అంటూ ఫ్లెక్సీ బ్యానర్స్ పెట్టించింది.

ఈ ఆరోపణలపై వెంటనే స్పందించిన టిఆర్ఎస్‌ నష్టనివారణ చర్యలు చేపట్టింది. గత నెల ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ప్రగతి భవన్‌లో ఉంటున్న నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన గువ్వల బాలరాజు నిన్న పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద మీడియా మాట్లాడుతూ, “మమ్మల్ని ఎవరూ నిర్బంధించలేదు. ఈ కేసును ఉపసంహరించుకోమని మాకు బెదిరింపులు వస్తుండటంతో ఇంటలిజన్స్ సూచన మేరకు మేము నలుగురం మా భద్రత కోసమే ప్రగతి భవన్‌లో ఉంటున్నాము. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం సిఎం కేసీఆర్‌ చేస్తున్న పోరాటంలో మేము కూడా భాగస్వాములుగా ఉండాలనుకొంటున్నాము. అందుకే కేసీఆర్‌కి అందుబాటులో ఉంటూ తదుపరి కార్యాచరణ రూపకల్పనలో పాలుపంచుకొంటున్నాము,” అని చెప్పారు.

అయితే బండి సంజయ్‌ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. “అసలు వారికి బయట నుంచి బెదిరింపులు వస్తున్నాయా లేక కేసీఆరే వారిని బెదిరిస్తున్నారా?ఆ నలుగురు కేసీఆర్‌ బందీలా లేక కేసీఆర్‌ బంధువులా ప్రగతి భవన్‌లో దాచిపెట్టడానికి?” అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. బిజెపిని దెబ్బ తీసే ప్రయత్నంలో కేసీఆర్‌ ఆ నలుగురు ఎమ్మెల్యేలను బలిపశువులుగా చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు.

ఈ పరిణామాలతో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అనే తీవ్ర అభద్రతాభావంతో కేసీఆర్‌ నిన్న హడావుడిగా టిఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి, ముందస్తుకి వెళ్ళడం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తానని ప్రకటించారని బండి సంజయ్‌ వాదించారు. తన కుమార్తె కవితను బిజెపిలో చేరాలని కేంద్రం ఒత్తిడి చేసిందంటూ కట్టుకధలు చెపుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ స్వయంగా టిఆర్ఎస్‌పార్టీని బిజెపిలో విలీనం చేస్తామన్నా అందుకు బిజెపిలో ఎవరూ అంగీకరించారని బండి సంజయ్‌ అన్నారు.

నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను నేటికీ ప్రగతి భవన్‌లోనే ఉంచుకోవడం ద్వారా వారిపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయని స్పష్టం అవుతోంది. కనుక వారికి ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉంటుంది. తమకు బెరింపు కాల్స్ వస్తున్నాయంటూ వారు పోలీస్ స్టేషన్‌లలో పిర్యాదులు చేయడమే ఇందుకు నిదర్శనం. కనుక ప్రగతి భవన్‌లో ఆశ్రయం కల్పించడం సమంజసంగానే ఉంది. కానీ ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు. అలాగే ఈడీ, సీబీఐ, ఐ‌టి దాడులు ఇప్పట్లో ఆగేవి కావు. కనుక ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతమందికి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఆశ్రయం కల్పించగలరు?అసలు కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం ఇంకా ప్రారంభించక మునుపే తన కోటలో ఎమ్మెల్యేలను ఉంచుకొని కాపాడుకోవలసివస్తే ఇక యుద్ధం ఎలా చేయగలరు?అనే సందేహం కలుగకమానదు.