Bandi-Sanjay-TRS-MLAతెలంగాణలో టిడిపి లేదని అందరూ అనుకొంటునప్పుడు ఇటీవల చంద్రబాబు నాయుడు ఖమ్మంలో బారీ బహిరంగసభ నిర్వహించి అందరూ నోళ్ళు వెళ్ళబెట్టేలా చేశారు. ఆ సభకి వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత తెలంగాణలో అన్ని పార్టీలు పునరాలోచనలో పడ్డాయి.

బిఆర్ఎస్‌గా మారిన టిఆర్ఎస్‌ ఆందోళన చెందగా, టిడిపితో పొత్తులు పెట్టుకోవాలా వద్దా అని బిజెపి ఊగిసలాడింది. కానీ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిడిపితో పొత్తులు పెట్టుకొంటే కేసీఆర్‌ ఏవిదంగా దానిని తనకు అనుకూలంగా మలుచుకొన్నారో ఇప్పుడూ అదేవిదంగా చేస్తారని కనుక టిడిపితో పొత్తులు పెట్టుకోకూడదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్ణయించారు. రాజకీయంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే అని చెప్పవచ్చు.

అయితే తెలంగాణలో బిజెపి ఎంత పుంజుకొన్నప్పటికీ 119 స్థానాలలో దేశముదురు బిఆర్ఎస్‌ అభ్యర్ధులను ఢీకొని పోరాడి గెలవగల అభ్యర్ధులు బిజెపిలో లేరు. కనుక వచ్చే ఎన్నికలలో కనీసం 90 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బిజెపి ‘మిషన్ 90’ పేరుతో సన్నాహాలు చేసుకొంటోంది. కానీ బిజెపికి ఉన్న ప్రస్తుత బలాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికలలో సొంతంగా 30-40 సీట్లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

కనుక తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా పరోక్షంగానైనా టిడిపితో స్నేహం, అవగాహన, మద్దతు చాలా అవసరం. కనుక వచ్చే ఎన్నికలలోగా తెలంగాణలో టిడిపి ఏమేరకు బలం పుంజుకోగలదనేది చాలా కీలకం కానుంది. వచ్చే ఎన్నికలలో టిడిపి కనీసం 20-25 సీట్లు గెలుచుకోగలిగితేనే మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పగలదు.

ఈ విషయం చంద్రబాబు నాయుడు, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో సహా తెలంగాణ టిడిపి నేతలందరికీ తెలుసు కనుకనే జనవరి నెలాఖరులోగా నిజామాబాద్‌లో మరో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సభ విజయవంతమైతే ఆ తర్వాత వరుసగా మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర జిల్లా కేంద్రాలలో బహిరంగసభలు నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇంతకాలం తెలంగాణ రాష్ట్రనికే పరిమితమైన బిఆర్ఎస్‌ పార్టీ వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేయాలని భావిస్తున్నందున, తెలంగాణలో టిడిపిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే, ఏపీలో దానిని టిడిపి అడ్డుకోగలదు. కనుక టిఆర్ఎస్‌, బిఆర్ఎస్‌గా మారడం కూడా ఓ విదంగా టిడిపికి కలిసి వచ్చిందని భావించవచ్చు.

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో టిడిపి-బిజెపిల మద్య అవగాహన ఏర్పడితే, దాని వలన ఏపీలో కూడా వాటి మద్య అవగాహన కుదురుతుంది. ఏపీలో టిడిపి మళ్ళీ అధికారంలోకి రావడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే తెలంగాణ రాజకీయాల ప్రభావం ఏపీపైనా, ఏపీ రాజకీయాల ప్రభావం తెలంగాణపైనా ఉండవచ్చని భావించవచ్చు.