Bandaru Dattatreyaతెలంగాణలో బీజేపీ సీనియర్ నేత అయిన బండారు దత్తాత్రేయకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తన్నను నియమించింది. ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకంతో దత్తన్న రాజకీయాలనుండి విరమించుకున్నట్టే. ఆయన చివరి సారిగా 2014 ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు.

ఆ తరువాత ఆయనను కేంద్ర సహాయమంత్రి పదవి కూడా వరించింది. అయితే ఆయనను పూర్తి కాలం అవ్వకముందే తప్పించారు. అప్పట్లోనే ఆయనను తమిళనాడు గవర్నర్‌గా నియమించనున్నారనే ప్రచారం సాగింది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు గవర్నర్ పదవి వరించింది. 2019లో పోటీ చెయ్యలేదు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కలరాజ్ మిశ్రాను రాజస్థాన్‌కు బదిలీ చేశారు. బండారు దత్తాత్రేయ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

నాలుగసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 89లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 96 నుంచి 98 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తొలిసారి 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. 1998, 99, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను తప్పించి, ఆయన స్థానంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్‌ను కేంద్రం నియమించింది.