Balka-Suman-Warns-YS-Sharmilaఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. “మాకు మహిళలంటే చాలా గౌరవం ఉంది. కానీ ఆమె (వైఎస్ షర్మిల) ఓ మహిళలా మాట్లాడుతోందా? మా ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి దోపీడీ దొంగలు, గూండాలు, రౌడీలు అంటూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటారు. మీకు మగతనం ఉందా?అని అడుగుతుంటారు. మేము దొంగలమా?నువ్వు దొంగ… నీ అయ్యా దొంగ… నీ కుటుంబమే దొంగల కుటుంబం. కానీ మేము తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులం. ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులం.

అయినా నీ మొఖానికి జీవితంలో సర్పంచ్ కూడా కాలేదు. నువ్వా మమ్మల్ని అనేది? మమ్మల్ని చెప్పుతో కొడతానంటే మేము ఊరుకోవాలా? మా గురించి ఈవిదంగా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటే మేము మా అనుచరులని ఆపలేకపోతున్నాము. చిన్న సంఘటన జరిగినా అందరూ మమ్మల్నే అంటారు. అందుకు మా క్యాడర్‌ని బలవంతంగా పట్టి ఉంచుతున్నాము. కానీ వారిని ఆపలేక మా తల ప్రాణం తోక్కొస్తోంది. లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు మాకు. మేము చిన్న సైగ చేస్తే వాళ్ళు నల్లిని నలిపినట్లు నలిపేస్తారు. కానీ మా సంస్కృతి అది కాదు.

అయినా నువ్వు… నీ అయ్యా…నీ అన్న చరిత్రలు మాకు తెలియనివా? నీ అయ్యా, నీ అన్న తెలంగాణ గురించి, ప్రజల గురించి ఎంత నీచంగా మాట్లాడారో తెలుసు. ఇవాళ్ళ కూడా కేసీఆర్‌ని పట్టుకొని తాలిబాన్ అంది. తెలంగాణని ఆఫ్ఘనిస్తాన్ అంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ అయితే మరి నువ్వు ఇక్కడెందుకు తిరుగుతున్నావు. పోయి నీ రాష్ట్రంలో తిరుక్కోవచ్చు కదా?ఎవరు రమ్మనారు ఇక్కడకి?నీకు ఇక్కడేంపని? నేను ఇప్పుడే చెపుతున్నాను. రేపు ఆమె మళ్ళీ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆమెకి ఏం జరిగినా మాకు సంబందం లేదు. లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు మాకు. వారందరినీ మేము ఎల్లకాలం పట్టి ఉంచలేము. ఇక మా చేతుల్లో ఏముంటుంది? కనుక జరుగబోయే పరిణామాలకి ఆమెదే పూర్తి బాధ్యత,” అని టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా హెచ్చరించారు.

ఒక పొరుగు రాష్ట్రం ఎమ్మెల్యే చేత వైఎస్సార్ కుటుంబం ఇటువంటి మాటలు అనిపించుకోవడం చాలా అవమానకరమే. అయితే జరుగబోయే పరిణామాలు ఏవిదంగా ఉంటాయో బాల్క సుమన్ తాజా హెచ్చరికలతో స్పష్టం అవుతోంది. ముందే చెప్పుకొన్నట్లు అప్పుడు వైఎస్ షర్మిల కూడా ఇంకా ధీటుగా వారిని ఎదిరిస్తారు. ఆమెకు, టిఆర్ఎస్‌ నేతలకి మద్య పోరు మొదలైతే నష్టపోయేది వారిరువురూ కారు. తెలంగాణ బిజెపి… పాదయాత్ర చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌. మీడియా, ప్రజలు కూడా ఈ పోరునే చూస్తారు తప్ప పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ని కాదు… ఆయనే చేసే విమర్శలను కాదు. అంటే బిజెపి హడావుడిని తక్కువ చేసేందుకే ఈ డ్రామా మొదలైందేమో? ఈ పోరు వలన టిఆర్ఎస్‌ పార్టీకే లాభం అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.