Balineni Srinivasa Reddyఒంగోలు వైసీపీ టీకప్పులో బాలినేని తుఫాను ఉవ్వెత్తున ఎగసిపడి చప్పున చల్లారిపోయింది. నిన్న తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వెళ్ళి కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలోనే కొందరు వ్యక్తులు నాకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అదే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే జిల్లాకు సంబందించి పనులకు నిధులు విడుదల చేయాలని కోరాను. దానికీ ముఖ్యమంత్రి అంగీకరించారు. ఒంగోలులో ఇళ్ళ నిర్మాణానికి ఇంతవరకు 30 శాతం నిధులే ప్రభుత్వం విడుదల చేసింది. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళితే త్వరలోనే మిగిలిన నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.

నేనేమి అలకపాన్పు ఎక్కలేదు. పార్టీలో అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు సహజమే. ముఖ్యమంత్రి హామీతో నేను పూర్తిగా సంతృప్తి చెందాను,” అని చెప్పారు.

నిజమే ఏ పార్టీలోనైనా ఇటువంటి చిన్న చిన్న సమస్యలు సహజమే. అయితే వాటి కోసం బాలినేని శ్రీనివాస రెడ్డి మూడు జిల్లాల ఇన్‌ఛార్జ్‌ పదవికి రాజీనామా చేయడం, ఒంగోలులో పార్టీ కార్యాలయం ఎదుట జగన్‌ ఫ్లెక్సీ బ్యానర్‌, పార్టీ జెండా తొలగించడమే అందరూ ఆయన పార్టీ మారబోతున్నారని భావించేలా చేసింది.

అయితే నెల్లూరు వైసీపీలో ముసలం పుట్టి వీరవిధేయులైన ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలను కోల్పోవడంతో ఈసారి సిఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యి బాలినేని శ్రీనివాస రెడ్డి చేజారిపోకుండా కాపాడుకొన్నారు.

అయితే సీమటపాకాయల దండలో ఒకసారి అగ్గి వెలిగించిన తర్వాత ఒకటి ఆరిపోయిన మిగిలినవన్నీ తప్పక పేలుతాయి. అలాగే బాలినేని టపాకాయను తుస్సుమనిపించినా తిరుపతిలోనో విశాఖ వైసీపీలోనో తప్పక రీసౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడనేదే పాయింట్!

కానీ ప్రస్తుతానికి బాలినేని కధ సుఖాంతం అయ్యింది కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒంగోలు వైపు చూడనవసరం లేదు. మిగిలిన 70% నిధులు విడుదల చేతే చాలు.