Balakrishna-TDP-Won-Hindupur-Assembly-Seatఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక వివాదాలలో ఇరుకున్న నందమూరి బాలకృష్ణ అనూహ్యంగా హిందూపూర్ నుండి మరోసారి ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికైన బాలకృష్ణ తన 2014 మెజారిటీ కంటే ఈ సారి మెరుగు పరుచుకోవడం విశేషం. రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా తన గత మెజారిటీని మెరుగుపర్చుకోలేక పోయారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం మెజారిటీ కూడా గత సారితో పోలిస్తే తగ్గడం గమనార్హం.

హిందూపురంలో టీడీపీ తిరుగులేని శక్తి. ఎన్టీఆర్ ఆ పార్టీ స్థాపించిన నాటి నుండి 2014 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో వరుసగా ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇక్కడ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నందమూరి హరికృష్ణ కూడా ఒక సారి ఎన్నికయ్యారు. స్థానికంగా అందుబాటులో ఉండరు అన్న ఒక్క అపవాదు తప్ప బాలయ్య నియోజకవర్గంలో బానే పని చేశారనే పేరు ఉంది. దీనితో బాలయ్య సొంత బలంతోనే ఇక్కడ గెలిచినట్టు అయ్యింది.

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటాలు కదిలిపోయాయి. మంత్రులు కూడా చాలా మంది ఓడిపోయారు. ఈ సమయంలో గెలవడం, మునుపటి మెజారిటీ కంటే మెరుగు పర్చుకోవడం బాలయ్య ను మెచ్చుకోవాల్సింది. దీని బట్టి బాలయ్య చేసిన మంచి కంటే చెడును మీడియా ఎక్కువ చేసి చూపించిందని అనుకోవచ్చు. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడం, తన ఇద్దరు అల్లుళ్ళు రాజకీయ అరంగేట్రం బాగా జరగకపోవడం బాలయ్యను బాధించేదే.