కృష్ణా పుష్కరాలలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ, పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పుష్కర స్నానం యొక్క పవిత్రతపై తనదైన శైలిలో తెలిపిన బాలకృష్ణ, పవిత్ర నదిలో స్నానమాచరించి పునీతులు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. అలాగే తన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పుష్కర పనుల్లో స్వచ్చందంగా పాలుపంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇక, నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వారసుడు మోక్షజ్ఞ తెరంగ్రేటంపై స్పందించిన బాలకృష్ణ, ప్రస్తుతం చదువుకుంటున్నాడని, విద్య ఎంత ప్రాముఖ్యమో తన తండ్రి తనకు చెప్పినా అబ్బలేదని, అయితే ఆ తర్వాత బిఎ పట్టభద్రుడిని కావడం వలనే తనకు చరిత్ర గురించి తెలుసుకున్నానని, అలాగే ఆసక్తి పెంచుకున్నానని, ఇపుడు మోక్షజ్ఞ కూడా చదువు పూర్తయిన తర్వాతే సినిమాల్లోకి వస్తాడని తెలిపిన బాలయ్య బాబు… బహుశా వచ్చే ఏడాది చివరికి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే తీపి కబురుకు అందించారు.
ప్రస్తుతం తానూ నటిస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా 40 శాతం షూటింగ్ ముగిసిందని, ఈ సినిమా తానూ చేయడం ఒక అదృష్టంలా భావిస్తున్నానని, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కొలువు తీరడం, దానికి సంబంధించిన కధతో తానూ సినిమా చేయడం కాకతాళీయమేనని అభివర్ణించిన ఈ నందమూరి నటసింహం, గౌతమీపుత్ర శాతకర్ణి పాలించిన రాజ్యాలలో అమరావతి మాత్రమే కాకుండా, తెలంగాణాలో కొండాపూర్, కాశీ వద్ద మరో రాజ్యాన్ని పరిపాలించాడని, అంతటి గొప్ప చరిత్ర గల మన తెలుగు రాజు కధ చేయడం గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు.