Balakrishna responds on three capitalsనిన్న అనంతపురంలో కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ ని అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు బాలయ్య కిందకు దిగకుండా నిగ్రహం చూపారు. ఈరోజు నిన్నటి ఘటనపై ఆయన స్పందించారు. “నేను నిన్న సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది. చట్టంపై మాకు గౌరవం ఉంది” అని చెప్పుకొచ్చారు.

గతంలో రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి ఇప్పుడు ప్రజల్లో లేనిపోని చీలికలు తెస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక వెలుగు వెలిగిన తెలుగు చరిత్ర ఇప్పుడెక్కడికి పోతోందని ప్రశ్నించారు. త్వరలోనే ప్రజల నుంచి విప్లవం వస్తుందని చెప్పారు. ఈ క్రమంలో బాలకృష్ణ మూడు రాజధానులపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక రాజధాని విశాఖ అని ఎప్పుడూ అంటూనే ఉన్నామని బాలకృష్ణ చెప్పారు. శాసన, కార్యనిర్వాహక శాఖలు ఎక్కడైనా ఒకచోటే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూలు నుంచి విశాఖ వెళ్లాలంటే ఎంతో దూరమవుతుందని చెప్పారు. రాష్ట్రానికి కియా అనుబంధ సంస్థలు రావాల్సింది పోయి వెనక్కి వెళుతున్నాయని ఆక్షేపించారు.

అన్ని విధాలుగా రాష్ట్రం తిరోగమనంలో ఉందని ఆయన వాపోయారు. ఇది ఇలా ఉండగా బాలయ్య హిందూపూర్ పర్యటన ముగించుకుని దుబాయ్ వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకుంటారట. ఫిబ్రవరి రెండో వారం నుండి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.