Balakrishna Responds On Akkineni Commentsచిన్న అగ్గిరవ్వ అడవిని కాల్చినట్టు ఏదైనా టాపిక్ దొరకడం ఆలస్యం సోషల్ మీడియా మొత్తం దావానలంలా వ్యాపించిపోతోంది. గత రెండు మూడు రోజులుగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని గురించి వాడిన ప్రాస పదం ఎంతటి రాద్ధాంతానికి దారి తీసిందో చూస్తున్నాం. ముఖ్యంగా దీని తాలూకు వీడియోలను యాంటీ ఫ్యాన్స్ వాడుకున్న తీరు ఇష్యూ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు ట్విట్టర్ వేదికగా దీని గురించి వివాదం రాకుండా హుందాగా స్పందించడం కథను మలుపు తిప్పింది

యథాలాపంగా అన్నా బాలయ్య దీని గురించి వివరణ ఇస్తే బాగుంటుదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమయ్యింది. ఆ సందర్భం ఇవాళ వచ్చింది. హిందుపూర్ లో పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి వచ్చిన బాలకృష్ణను మీడియా ఈ అంశం మీదే ప్రత్యేకంగా ప్రశ్నించింది. దానికాయన బదులిస్తూ నాన్నగారి నుంచి క్రమశిక్షణ, బాబాయ్ ఏఎన్ఆర్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండాలనే తత్వం నేర్చుకున్నానని అలాంటిది ఉద్దేశపూర్వకంగా ఎందుకు నోరు జారతారని ఇదంతా కేవలం బయట వ్యక్తులు సృష్టించిన అపోహ తప్ప మరొకటి కాదన్నారు. ఎన్టీఆర్ పేరుతో నెలకొల్పిన జాతీయ అవార్డుని ముందు బాబాయ్ కే ఇవ్వడం కూడా ప్రస్తావించారు

నేరుగా నాగార్జున చైతు అఖిల్ ల ప్రస్తావన తేకపోయినా అక్కినేని నాగేశ్వరరావు మీద తనకున్న గౌరవాన్ని పబ్లిక్ గా చాటిన బాలయ్య ఈ వివాదానికి దాదాపుగా చెక్ పెట్టినట్టే. నిన్న కొందరు ఏఎన్ఆర్ అభిమానులు హైదరాబాద్ కూకట్ పల్లి థియేటర్ వద్ద నిరసన వ్యక్తం చేయడంతో ఇదింకా ఎక్కడి దాకా వెళ్తుందోనని టెన్షన్ ఏర్పడింది కానీ ఫైనల్ గా బాలయ్య తనదైన శైలిలో కూల్ గా ఈ ప్రచారానికి చెక్ పెట్టారు. ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు అర్థం లేకపోయినా ఫ్లోలో అంటామని దానికి అర్థాలు తీయడం అనవసరం అన్న రీతిలో క్లారిటీ ఇచ్చారు. స్వంత పిల్లల కన్నా తనను ఎక్కువ ప్రేమించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

బయట జరిగే వాటిని పట్టించుకోనన్న బాలకృష్ణ ట్విట్టర్ ఫేస్ బుక్ జరిగిన రచ్చ గురించి కొందరు జర్నలిస్టులు అడిగే ప్రయత్నం చేసినా కేవలం తాను చెప్పాలనుకున్న వివరణ మాత్రమే స్పష్టంగా ఇచ్చారు. నిన్న ఎస్వి రంగారావు కుటుంబసభ్యులు సైతం నందమూరి ఫ్యామిలీతో తమకు చక్కని బంధం ఉందని, లేని అపోహలతో వాటిని దెబ్బ తీయొద్దని విన్నవించారు. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బాలయ్య నుంచి స్వయంగా సమాధానం రావడం ఇకనైనా ఈ టాపిక్ ని క్యాష్ చేసుకుందామనుకుంటున్న వర్గాలను చల్లారుస్తుందో లేదో చూడాలి