balakrishna pawan kalyan aha unstoppable episodeబహుశా ఒక తెలుగు ఓటిటి షోకి ఈ స్థాయిలో ప్రమోట్ చేయడం బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన అన్ స్టాపబుల్ షో ఫైనల్ ఎపిసోడ్ కే జరిగిందని చెప్పాలి. ప్రభాస్ వచ్చినప్పుడూ హంగామా చేశారు కానీ అది అధిక శాతం ఆన్ లైన్ కే పరిమితమయ్యింది. పవన్ ది మాత్రం నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోయారు. విజయవాడ లాంటి నగరాల్లో కటవుట్లు పెట్టడం, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఒరిజినల్ స్ట్రీమింగ్ కన్నా రెండు గంటల ముందు స్పెషల్ ప్రీమియర్ వేయడం ఇవన్నీ ఎప్పుడు విననివి. ఈసారి యాప్ క్రాష్ కాకుండా ఆహా జాగ్రత్తలు తీసుకుంది కానీ మధ్య మధ్యలో చిన్న అవాంతరాలైతే తప్పలేదు. ఇక అసలు ముచ్చట్ల విషయానికి వద్దాం.

బాలయ్య పవన్ ల మధ్య బాండింగ్ ఎపిసోడ్ మొత్తం చక్కగా సాగింది. ప్రభాస్ కు చేసినట్టు ఒకే టాపిక్ చుట్టూ పదే పదే తిప్పకుండా చాలా అంశాలే చర్చించారు. పవర్ స్టార్ ని ఇంటిపేరుతో సహా పూర్తిగా సంబోధించాక సుభాష్ చంద్రబోస్ తో పోల్చడం, దమ్మునోడంటూ కితాబివ్వడం బాగా పేలాయి. భీమ్లా నాయక్ కి కొమరం భీమ్ స్వాగతమంటూ పరమవీరచక్రలో బాలయ్య స్టిల్ ని ప్రదర్శించడం వెరైటీగా ఉంది. పవన్ నవ్వు, గుడుంబా శంకర్ ప్యాంట్, ఇప్పుడు జనసేన కోసం వైట్ అండ్ వైట్ కు వచ్చేయడం, సుస్వాగతం ఓపెనింగ్ కి ఇద్దరూ మొదటిసారి కలుసుకోవడం, చిరంజీవి పుట్టినరోజుకు బాలయ్య వచ్చినప్పుడు మొదటిసారి పవన్ చూడటం ఇవన్నీ ప్రస్తావించుకున్నారు. మెగా కుటుంబాన్ని బాలయ్య క్యూట్ ఫ్యామిలీ అంటూ కితాబు ఇవ్వడం బాగుంది.

సుస్వాగతం షూటింగ్ వైజాగ్ జగదాంబ జంక్షన్ లో బస్సు మీద డాన్సు షూటింగ్ చేస్తున్నప్పుడు సిగ్గుతో చితికిపోయిన విషయాన్ని పవన్ షేర్ చేసుకున్నాడు. వ్యవసాయం, గోశాల, త్రివిక్రమ్ తో స్నేహం, అతడు కథ చెప్పినప్పుడు నిద్ర పోవడం ఇవన్నీ చెప్పుకున్నాడు. రామ్ చరణ్ కు ఫోన్ చేసినప్పుడు అయిదేళ్ల వయసులో సింగపూర్ రోడ్ల మీద ఎక్కువ తినేసి వాంతి చేసుకున్నప్పుడు పవనే మొత్తం శుభ్రం చేసి కేర్ తీసుకున్న సంఘటన గుర్తు చేశాడు. బావర్చి బిర్యానీ బాబాయ్ కు ఫెవరెట్ అనే సంగతి కూడా బయట పెట్టాడు. ప్రత్యర్థులకు విమర్శల బాణంగా మారిన మూడు పెళ్లిళ్ల గురించి కాసింత సీరియస్ గా అనుకున్న దానికన్నా ఎక్కువ చర్చే జరిగింది.

చట్టప్రకారం విడాకులు తీసుకున్నాకే పెళ్లి చేసుకున్నాను తప్ప ముగ్గురిని ఒకేసారి పెళ్లాడలేదంటూ పవన్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన బాలయ్య ఇకపై ఎవరు ఈ విషయం మీద కామెంట్ చేసినా వాళ్ళు ఊరకుక్కలతో సమానమంటూ ఇచ్చిన వార్నింగ్ పేలింది. తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ, మావయ్య గురించి ఒక రెండు ముక్కలు చెప్పి త్వరగానే సెలవు తీసుకున్నాడు. చాలా తక్కువ మాట్లాడిన పవన్ నుంచి వీలైనంత ఎక్కువ రాబట్టుకునేందుకు బాలకృష్ణ గట్టిగానే ప్రయత్నించారు కానీ బదులు పరిమిత మోతాదులోనే వచ్చింది. ఇంకా రెండో భాగం ఉందంటున్నారు కాబట్టి అందులో అసలైన స్ట్రాంగ్ కంటెంట్ దాచారేమో చూడాలి.