balakrishna-on-gautamiputra-satakarni-movie-role-and-trailer‘అఖండ భారతావనిని పరిపాలించిన గొప్ప రాజు గౌతమీపుత్ర శాతకర్ణి’ అని నందమూరి నటసింహం బాలకృష్ణ తెలిపారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి కధతో తెరకెక్కిన “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా పంచభక్ష్యపరమాన్నాలంత గొప్పగా వచ్చిందని అన్నారు. భావితరాలకు ఈ సినిమా గొప్ప పుస్తకంలా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు బాలకృష్ణ.

శాతవాహనులను ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ దేశాలు తలచుకుంటాయని, తెలుగు వారి కీర్తి ప్రతిష్ఠతలను దశదిశలా వ్యాపింప చేసిన మహారాజు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని, ఆయనలాగే తన తండ్రి కూడా తన వెన్నుపై తెలుగు దేశం జెండాను మోశారని స్వర్గీయ నందమూరి తారక రామారావుని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శాతవాహన సామ్రాజ్యానికి కోటిలింగాలు ముఖద్వారం వంటిదని, అందుకే ఇక్కడ ఈ సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించనున్నామని తెలిపారు.

తన 100వ సినిమాగా ఈ సినిమా కధ తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, అంతటి గొప్ప చక్రవర్తి పాత్రను పోషించడం తన అదృష్టమని అన్నారు. తెలుగు సినీ చరిత్రలో మరుపురాని చిత్రంగా ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిలిచిపోతుందని, దేశ ఏకీకరణకే ఆయన పోరాటం చేశారని, శాంతి, సుస్థిరతతోనే పరిపాలించారని బాలయ్య తెలిపారు.