balakrishna and boyapati srinuసింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. వరుస పరాజయాలతో చతికల పడ్డ బోయపాటి బాలయ్యతో మూడవ సినిమా తెరకెక్కించే ప్రయత్నాలలో ఉన్నారు. బాలయ్య తన తదుపరి చిత్రం జయసింహ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో కాసేపు ఉంటుందని, కాసేపు ఉండదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో అభిమానులు ఈ సినిమా పట్టాలు ఎక్కాలని కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సీనియర్ నిర్మాత దిల్ రాజు అంటే ట్రేడ్ కు చాలా నమ్మకం. సినిమా తీసే క్రమంలో ఆయన తీసుకునే జాగ్రత్తలు, సినిమా విడుదలకు థియేటర్లు, తరువాత పబ్లిసిటీ ఇలా అన్నిటిలో దిల్ రాజు తీసుకునే జాగ్రత్తలు ఈ సినిమాకు కలిసి వచ్చేవే. దీనితో ఈ సినిమాకు దిల్ రాజు వస్తుందనే వార్త మరింత హైప్ ను పెంచేదే.

దిల్ రాజు ఇప్పటిదాకా బాలకృష్ణ తో పని చెయ్యలేదు. ఆయన బోయపాటితో పని చేసి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది. బోయపాటి మొదటి సినిమా భద్రాను దిల్ రాజే నిర్మించారు. అయితే ఇప్పుడు బాలయ్య ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 2019లో ఇప్పటివరకు బాలయ్యకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ సంవత్సరం వచ్చిన ఎన్టీఆర్ చిత్రం రెండు భాగాలు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అదే సమయంలో బాలయ్య హిందూపురం నుండి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా బాలయ్య తన 2014 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం విశేషం. ఈ సంవత్సరం బాలయ్య కు మునుముందు ఎలా ఉంటుందో చూడాలి.