Balakrishna-KS-Ravi-Kumarఅనంతపురం జిల్లాలోని హిందూపురం టీడీపీ అభ్యర్థి, ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ రెండో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవలే మళ్ళీ హిందూపురం వెళ్ళి బాలయ్య స్థానిక నేతలతో భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందనీ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలనీ పిలుపునిచ్చి ఎన్నికలలో తన గెలుపు పై ఎటువంటి అనుమానం లేదని మెస్సేజ్ పంపారు.

పెన్షన్ల పెంపు, ఆడపడుచులకు పసుపు- కుంకుమ పథకం, దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులకు అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాలే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టబోతున్నాయని బాలకృష్ణ వివరించారు. అలాగే నియోజకవర్గంలో బూత్ల వారీగా నమోదైన ఓటింగును విశ్లేషించి తనకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు బాలయ్య బాబు. ఏ పోలింగ్‌బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? పోలైన ఓట్లలో టీడీపీతోపాటు ఏఏ పార్టీలకు ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది? అనే కోణంలో బాలయ్య, పార్టీ కూడా అనేక సర్వేలు చేయించి పురం కోట మీద మరోసారి పసుపు జండా ఎగురుతుందనే నిర్ణయానికి వచ్చారట.

హిందూపురంలో టీడీపీ తిరుగులేని శక్తి. ఎన్టీఆర్ ఆ పార్టీ స్థాపించిన నాటి నుండి 2014 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో వరుసగా ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇక్కడ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నందమూరి హరికృష్ణ కూడా ఒక సారి ఎన్నికయ్యారు. స్థానికంగా అందుబాటులో ఉండరు అన్న ఒక్క అపవాదు తప్ప బాలయ్య నియోజకవర్గంలో బానే పని చేశారనే పేరు ఉంది. దీనితో బాలయ్య ధీమాగానే ఉన్నారు.