చిరంజీవి  చేసిన తప్పు బాలకృష్ణ చేయలేదు! రాజకీయాలలో విమర్శలు సహజం. అయితే వాటికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హద్దులకు తిలోధకాలు ఇచ్చేస్తూ సాగుతుండడం సగటు ప్రజలకే కాదు, రాజకీయ ఉద్దండులకు కూడా మింగుడు పడని అంశంగా మారింది.

తన సోదరిని అవమానిస్తూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో సహా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు తమను సంయమనం ఉండమని అడ్డుకున్నారని, ఇకపై చంద్రబాబుని అడగాల్సిన అవసరం కూడా లేదని తీవ్రంగా స్పందించారు.

‘ఒరేయ్ నానిగా… ఒరేయ్ వంశీగా… అంబటి రాంబాబు… ఒరేయ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి… మీరు హద్దులు దాటిపోయారు, ఇకపై జాగ్రత్తగా ఉండాలి, తమ కుటుంబం మీదకు వస్తే బాగుండదు’ అంటూ నందమూరి రామకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ను ఇచ్చారు.

ఇలా మూకుమ్మడిగా నందమూరి కుటుంబం మొత్తం వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. దీంతో వైసీపీ నేతలు డిఫెన్స్ లో పడుతూ… తాము అసలు భువనేశ్వరి గారిని ఏమీ అనలేదు, మేమెందుకు అలా అంటాము అంటూ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నారు.

ఇప్పటికైనా తాము చేసిన తప్పులకు వైసీపీ నేతలు తెలుసుకుని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి పునరావృతం చేయకుండా ఉంటే చాలు అన్నది పొలిటికల్ వర్గాల విశ్లేషణ. అయితే ఈ ఉదంతం ఇటీవల పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ కూతురిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేస్తోంది.

నాడు ప్రెస్ మీట్ నిర్వహించి మరీ పవన్ తనయురాలిని పోసాని అనకూడని మాటలు అన్న సందర్భంలో మెగా కుటుంబం నుండి ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. బహుశా ఆ తప్పును బాలకృష్ణ అండ్ కో చేయకుండా ముక్తకంఠంతో ఆహ్వానించదగ్గ పరిణామం.