Balakrishna  -Ramanujaతనకు ఆధ్యాత్మిత చింతన చాలా అధికమని, అన్ని మతాలకు చెందిన గ్రంథాల్లోని సారాన్ని తెలుసుకుంటుంటానని, తన అరవయ్యో ఏట రామానుజాచార్యగా నటించనున్నానని నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రకటించారు. తన కొత్త చిత్రం ‘జై సింహా’ విజయోత్సవ వేడుక లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసారు. మరో మూడేళ్లలో “రామానుజాచార్య” సినిమా పట్టాలెక్కుతుందని చెప్పారు.

ప్రజలంతా సమానమేనని చెబుతూ చాపకూటి సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంతో పాటు అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ పంచిన రామానుజాచార్యుల పాత్రలో నటించాలన్నది తన కోరికని చెప్పారు. తాను వైవిధ్య భరితమైన పాత్రలు చేసిన ప్రతిసారీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారని అన్నారు.

ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం తన అదృష్టమని, అతి త్వరలో ఆయన జీవిత కథ ఆధారంగా తీసే చిత్రం ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా, ‘జై సింహా’ చిత్రంలో బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని చాటేలా సన్నివేశాలు తీర్చిదిద్దారని ఈ కార్యక్రమానికి హాజరైన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు బాలకృష్ణను అభినందించారు.