Balakrishna - Chhiranjeeviతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొత్త వివాదం ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన తరువాత బాలయ్య మీడియాతో మాట్లాడారు. సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు తనకు తెలియదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తనను ఎవరు రమ్మని పిలవలేదని చెప్పుకొచ్చారు.

సినిమా షూటింగులు ప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో చర్చల విషయం పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తెలుసుకున్నట్లు చెప్పారు. జూన్‌లో షూటింగులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. షూటింగ్‌ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని కోరారు.

ఎక్కువ శాతం షూటింగ్‌లు ప్రారంభమైన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. షూటింగ్‌ సమయంలో సామాజిక దూరం పాటించాలని బాలయ్య స్పష్టం చేశారు. ఆ తరువాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో విలేఖరులతో మాట్లాడుతూ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బాలయ్య.

“నన్ను ఎవరూ పిలవలేదు. వీళ్లంతా హైదరాబాద్ కూర్చుని భూములు పంచుకుంటున్నారా,” అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగుతుంది. టీవీ ఛానళ్లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.