Akhanda
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన “అఖండ” సిల్వర్ స్క్రీన్ ను పలకరించింది. అశేష సినీ ప్రేక్షకులతో ‘అఖండ’ ధియేటర్లు కళకళలాడుతుండడం తెలుగు సినీ వర్గాలకు నూతన ఉత్సాహాన్ని పంచుతోంది. మరి ఇంతకీ ‘అఖండ’ టాక్ ఏంటి? అభిమానుల స్పందన ఎలా ఉంది? సాధారణ ప్రేక్షకుల మాటేంటి? అంటే…

నందమూరి నటసింహం – బోయపాటి శ్రీను కాంభినేషన్ లో ‘హ్యాట్రిక్’ పరిపూర్ణం అయినట్లే అన్న టాక్ ‘ముక్తకంఠం’తో వినపడుతోంది. ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉందని బాలయ్య అభిమానులు చెప్తుంటే, ‘అఖండ’ క్యారెక్టర్ తో అదరగొట్టేసారని సినీ ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. బాలకృష్ణ రెండు పాత్రలను బోయపాటి బాగా డీల్ చేసారని, ఆ రెండు పాత్రలకు జీవం పోయడంలో బాలయ్య విజయవంతం అయ్యారనేది ప్రీమియర్ టాక్.

ఇక బాలకృష్ణ తర్వాత “అఖండ” సినిమాలో హైలైట్ అవుతోంది మాత్రం సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్. గత రెండు నెలలుగా ‘అఖండ’ ట్రాన్స్ లో ఉండిపోయానని థమన్ ఎందుకు చెప్పారో అర్ధం అయ్యే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉందన్నది తిరుగులేని టాక్. అద్వితీయమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడని ప్రేక్షక లోకం థమన్ పై అభిమాన వర్షం కురిపిస్తున్నారు.

విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగిన తర్వాత మళ్ళీ “అఖండ” ద్వారా విలన్ గా రీ ఎంట్రీగా ఇచ్చిన శ్రీకాంత్ కూడా తన పాత్రకు న్యాయం చేసారు. మొత్తానికి టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా ప్రేక్షకుల ఆదరణ ఉండడం శుభపరిణామం. కానీ సక్సెస్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటున్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే.