Akhanda in Mass theatresభారీ అంచనాల నడుమ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన “అఖండ” సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణల కాంబో మరోసారి మాస్ వర్గాలను ఉర్రూతలూగిస్తోంది.

అందుకు నిదర్శనంగా పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదో ప్రీమియర్ షోల మాదిరి, రెండవ రోజు కూడా జనాలు కరోనాను కూడా లెక్క చేయకుండా గుంపులు గుంపులుగా తోసుకుంటూ వెళ్తున్న వైనం నందమూరి అభిమానులకు రెట్టించిన ఉత్సాహాన్ని ఇస్తోంది.

బాలకృష్ణ చిత్రాలలో మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ ను సాధించిన సినిమాగా ఇప్పటికే రికార్డులు కొల్లగొట్టిన “అఖండ,” రెండవ రోజు కూడా అదే దూకుడును ప్రదర్శిస్తూ, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పట్టు నిలబెట్టుకుంది.

యుఎస్ లో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకున్న ‘అఖండ’ ఈ వారాంతం ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ దాటి లాభాలలోకి అడుగు పెట్టడం ఖాయంగా కనపడుతోంది. ఈ పరిణామాలు “అఖండ” చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ మొత్తాన్ని సంతోషంలో ముంచెత్తుతోంది.

నిజానికి ఈ సినిమా కంటెంట్ పరంగా కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదని తొలిరోజు వెలువడిన రివ్యూలు చెప్పేసాయి. రొటీన్ బోయపాటి మాస్ కొట్టుడు కామన్ అయినా, ‘అఖండ’ క్యారెక్టర్ లో బాలకృష్ణ నటించిన విధానం, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు జీవం పోశాయి. ఈ ఇద్దరే ‘అఖండ’ను నిలబెట్టారు.