2022 సంక్రాంతి పండగకు “ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్, బంగార్రాజు” సినిమాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకటి రెండు సినిమాలు వెనక్కి వెళ్లే అవకాశాలు చివరి నిముషం వరకు ఉంటుందని సినీ వర్గాలు ఇప్పటికీ చెప్తున్నాయి. తాజాగా ఇందులో మరో సినిమా వచ్చి చేరుతుందనేది లేటెస్ట్ న్యూస్.

అయితే అది సిల్వర్ స్క్రీన్ పైన కాదు, స్మాల్ స్క్రీన్ పైన! ప్రస్తుతం ధియేటర్ లలో ప్రేక్షకులను ఊపిస్తోన్న నందమూరి నటసింహం “అఖండ” సినిమాను సంక్రాంతి సమయంలో ఓటీటీలో ప్రదర్శితం చేయడానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్ధమవుతోందని సమాచారం.

బహుశా ధియేటర్ కు వెళ్లి సినిమాలు చూడలేని వారికి ఓ ప్రత్యామ్నాయంగా బాలయ్య “అఖండ” ఓటీటీ ఆప్షన్ ఉండనుంది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా సంక్రాంతి సినిమాల సందడితో ధియేటర్ లలో పూర్తిగా కనుమరుగు కానుంది. ఇదే ఊపులో ఓటీటీలో ప్రదర్శితం చేయడం కూడా సముచితమైన ఆలోచనే!

‘అఖండ’ సక్సెస్ తో కరోనా తర్వాత తెలుగు సినీ గమనాన్ని సరికొత్తగా ఆరంభించిన బాలయ్య, ప్రస్తుతం ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఇప్పటికే ఓటీటీలో వీరవిహారం చేస్తున్నారు. సంక్రాంతికి గనుక హాట్ స్టార్ లో ‘అఖండ’ ప్రత్యక్షం అయితే మరోసారి ప్రేక్షకుల చేత ‘భం అఖండ’ అనిపించడం ఖాయం.