పవర్ ఫుల్ మరియు పౌరాణిక పాత్రల్లో నందమూరి నటసింహం అభినయం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా విశదీకరించనవసరం లేదేమో! అయితే అలాంటి పాత్రలు బహు అరుదుగా లభిస్తుంటాయి. ఇవి ఆడియన్స్ మెప్పు పొందితే కనకవర్షంతో పాటు విమర్శకుల ప్రశంసలు, కమిటీల అవార్డులు అన్నీ వశమవుతాయి. అలాంటి పాత్రే తన 100వ సినిమాకు లభించిందని స్వయంగా బాలకృష్ణ ఇటీవల జరిగిన తన మనవడి పుట్టినరోజు కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో వ్యాఖ్యానించారట.
ఈ సమాచారం ఆ నోట… ఈ నోట… పలికి ప్రస్తుతం వెబ్ మీడియాలో సందడి చేస్తోంది. సామాజిక చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో “గౌతమిపుత్ర శాతకర్ణ” వంటి చారిత్రాత్మక చిత్రం ద్వారా ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ అవార్డులైన ఆస్కార్ ను కొట్టే అవకాశం కూడా ఉందంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు సన్నిహితుల ద్వారా బయటకు వచ్చాయి. అలాగే ప్రస్తుతం బాలయ్య కనిపిస్తున్న లుక్ కూడా ఈ సినిమాకు సంబంధించినదే అని కూడా బాలయ్య వ్యాఖ్యానించారట. చారిత్రాత్మక కధాంశం కావడంతో సర్వత్రా బాలయ్య మాటలకు మిక్కిలి ప్రాధాన్యత లభించింది.