Balakrishna Second Son-in-law Sri Bharat Contesting Upcoming Elections--విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి (గీతం మూర్తి) మనవడు, నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ దాదాపుగా ఖరారు అయినట్టుగా కనిపిస్తుంది. టీడీపీ సంస్థాగత బలంతో పాటు గీతం మూర్తి హఠాన్మరణం తరువాత వచ్చిన సెంటిమెంట్ తో గెలుపు నల్లేరుపై బండి నడకే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈరోజు ఉదయం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన తాతగారి ఆశయాలు, ఆలోచనలతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలోకి వస్తున్నాను… పార్టీ ఆదేశిస్తే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారని, ఏపీలో రాజధాని అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయగల సమర్ధత నాయకుడు చంద్రబాబు మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నుండి హామీ రాకుండా శ్రీ భరత్ మీడియా ముందుకు రారని, దీనితో ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయినట్టే అని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. శ్రీ భరత్ పోటీ చేస్తే బాలకృష్ణ, ఈసారి తన ఇద్దరు అల్లుళ్ళతోనూ కలిసి పోటీ చేస్తున్నట్టు అవుతుంది.

గత ఎన్నికలలో విశాఖలో వైకాపాకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. జగన్ తల్లి విజయమ్మ స్వయంగా విశాఖ పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు. ఆవిడ మీద బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు గెలిచారు. టీడీపీ – బీజేపీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో టీడీపీనే ఈ సారి ఇక్కడ నుండి పోటీ చెయ్యబోతుంది. వైకాపా నుండి విజయసాయిరెడ్డి పోటీ చేస్తారనే వదంతులు వినిపిస్తున్నాయి. పొత్తు లేకుండా బీజేపీ, జనసేన విడిగా పోటీ చేస్తే పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదని విశ్లేషకుల అంచనా.