YS Jagan - New Schemeఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ తన కేసులలో విచారణకు సహకరించడం లేదు. ఏదో ఒక సాకు చెప్పి కోర్టుకు హాజరుకావడం లేదు. దాదాపుగా ఏడాదిన్నర కాలంలో ఆయన కోర్టుకు వెళ్ళింది ఒక్కసారే. అప్పుడు కూడా న్యాయమూర్తి రాకపోవడంతో విచారణ జరగలేదు.

అయితే ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు రోజువారీగా విచారించి తొందరగా తేల్చాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడంతో జగన్ కేసులలో కదలిక వచ్చింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఆయనకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది.

దీంతో అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సీఎం జగన్‌తో పాటు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.

ఇప్పటికే జగన్ కేసులలో ఐదు ఛార్జ్ షీట్లు ఈడీ కోర్టులో ఉన్నాయి. వీటి మీద రోజూ వారీ విచారణ మొదలుపెడితే ముఖ్యమంత్రి తరచు కోర్టుకు వెళ్లాల్సి రావొచ్చు. అయితే ఇది రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది ప్రతిపక్షాల చేతిలో ఆయుధంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఏ వంకతో కోర్టుకు వెళ్లకుండా ఉంటారో అనేది చూడాలి.