Babu Baga Busy Screening - Avasarala srinivasబాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ తుఫాన్ కొనసాగుతుండగానే, ధైర్యం చేసి ‘బాబు బాగా బిజీ’ సినిమాను ధియేటర్లలోకి తీసుకువచ్చింది చిత్ర యూనిట్. అనేక వాయిదాల అనంతరం, ఎట్టకేలకు సిల్వర్ స్క్రీన్ ను టచ్ చేసిన ఈ బాలీవుడ్ రీమేక్ కు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా లేకపోవడం విశేషం. నిజానికి హాట్ హాట్ ‘హంటర్’ సినిమా రీమేక్ గా తెరకెక్కిన దీనిపై, ప్రేక్షకుల్లో బజ్ ఉంటుందని భావించినప్పటికీ, అలాంటిదేం వసూళ్ళ రూపంలో కనిపించకపోవడం చిత్ర యూనిట్ కు విస్మయానికి గురి చేస్తోంది.

అయితే ప్రేక్షకులు ఇంకా “బాహుబలి 2” నుండి బయటకు రాలేదని స్పష్టమవుతోంది. ఈ సినిమా సాధిస్తున్న రికార్డులు, రాజమౌళి తెరకెక్కించిన విధానం గురించి ఇప్పటికీ సగటు ప్రేక్షకుల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ అవుతోన్న అప్ డేటెడ్ కలెక్షన్స్ ‘బాహుబలి’ని మన తెలుగు సినిమాగా గర్వంగా చెప్పుకునే స్థాయి నుండి ప్రేక్షకులు ఇప్పట్లో బయటకు వచ్చేలా కనపడడం లేదు. ఎందుకంటే, మరో రెండు వారాల పాటు బాక్సాఫీస్ ఒక్క ‘బాహుబలి 2’ గురించే మాట్లాడుకునే విధంగా జననీరాజనం లభిస్తోంది.

మరో వైపు కనీసం ఆకట్టుకునే విధంగా అయినా ‘బాబు బాగా బిజీ’ని మలిచి ఉంటే, ఎంతో కొంత సందడి వాతావరణం నెలకొనేది. కనీసం ‘బాహుబలి 2’ టికెట్లు లభించని వారికి ప్రత్యామ్నాయంగా ఉండేది. కానీ, ఈ రీమేక్ ను తెలుగుకు అనుగుణంగా మలచడంలో చిత్ర యూనిట్ విఫలమైందని సినీ విశ్లేషకులు తేల్చేయడంతో పరిస్థితి మరింత దిగజారినట్లయ్యింది. ముఖ్యంగా చిత్రంలో ప్రధాన పాత్ర అయిన అవసరాల శ్రీనివాస్ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో, ప్రేక్షకులకు – సినిమాకు సంబంధం కట్ అయినట్లుగా కనపడింది.