baahubali-unit-will-be-arrestedసినిమాలలో జంతువులను వినియోగించాలంటే సంబంధిత అధికారుల నుండి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి అనుమతులు లేకుండా ఇటీవల “బాహుబలి” చిత్ర యూనిట్ షూటింగ్ నిర్వహించినట్లుగా తేలడంతో సదరు చిత్ర బృందంపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతోంది.

ఇటీవల కేరళలోని త్రిసూర్ లో జరిగిన షూటింగ్ సందర్భంలో ఓ ఏనుగుపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. దాంతో ఈ చిత్ర బృందంపై జంతు హక్కుల పరిరక్షకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా దర్శకుడు, నిర్మాతలను అరెస్టు చేయాలని ‘యానిమల్ టాస్క్ ఫోర్స్’ బృందం డిమాండ్ చేసింది.

భారత వన్యమృగ బోర్డు నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సినిమాలో ఏనుగును షూటింగు కోసం ఉపయోగించారన్నది అసలు ఆరోపణలు. షూటింగు జరుగుతున్నంత సేపు యూనిట్ సభ్యుల అరుపులు, కేకల వల్ల ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం వెల్లడించారు. ఈ క్రమంలో వన్యమృగాల చట్టం-2001లోని నియమాలను వారు ఉల్లంఘించారని చెబుతున్నారు. అందుకే ఈ సినిమా దర్శక, నిర్మాతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఆదేశించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరామని తెలిపారు. మరి అదే జరిగితే టాలీవుడ్ లోనే ఓ సంచలన అంశంగా మారనుంది.